ఎంపీ జేసీపై తిరుగుబాటు చేసిన ఒకే ఒక్క నేత...!

Update: 2017-12-20 09:30 GMT

జేసీపై తొలిసారి ఒక మహిళా ప్రజాప్రతినిధి గొంతు విప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలే అంతరింగక సమావేశాల్లో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జేసీపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం అనంతపురం జిల్లాలోని ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నేత చేయలేదు. కాని నగర మేయర్ స్వరూప మాత్రం జేసీపై విరుచుకుపడ్డారు. అనంతపురం నగర మేయర్ స్వరూప ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గంగా ఉంటున్నారు. అయితే జేసీ ఇటీవల కాలంలో అనంతపురం పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు. రోడ్ల విస్తరణలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు నిధులను కూడా కేటాయించేలా జేసీ ప్రభుత్వం పై వత్తిడి తెచ్చారు. సాధించుకున్నారు.

అనంతలో ముదురుతున్న విభేదాలు....

దీంతోపాటుగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాధరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా జేసీ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. దీంతో ప్రభాకర్ చౌదరి లోలోపల మధనపడుతూనే అధినేత చంద్రబాబును గౌరవించి మౌనంగా ఉంటున్నారు. ఇటీవల అనంతపురంలో గురునాధరెడ్డి ఫ్లెక్సీలు పెట్టి హంగామా చేయడం కూడా ప్రభాకర్ చౌదరి వర్గానికి మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో నగర మేయర్ స్వరూప జేసీ దివాకర్ రెడ్డిని రాక్షసుడని సంభోదించడం విశేషం. జేసీ దివాకర్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు జేసీ తన నల్లకళ్లద్దాలు తీసి అనంతపురం లో జరిగే అభివృద్ధి పనులను చూడాలని కూడా ఆమె కోరారు. ఎప్పుడో ఒకసారి అనంతపురం వచ్చే జేసీ తన నిధుల నుంచి అనంతపురం అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా? అని ఆమె ప్రశ్నించారు. జేసీ ఇప్పటికైనా అభివృద్ధికి అడ్డుపడకుండా రాజకీయాలకు జేసీ గుడ్ బై చెప్పాలని ఆమె కోరారు. జేసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్వరూప ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం కావడంతో అనంతలో టీడీపీ గొడవలు మరింత పెరిగే అవకాశముంది.

Similar News