గోకరాజు గంగరాజు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏ ఎమ్మెల్యేతోనూ పెద్దగా కలవరు. ముఖ్యంగా ఆచంట ఎమ్మెల్యే, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ అంటే అస్సలు పడదు. ఆయన తన నియోజకవర్గం పరిధిలో తన కార్యక్రమాలను తానే చేసుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్న సంగతే మరిచిపోయారు. పార్టీ కార్యక్రమాలైనా, అధికారిక కార్యక్రమాలైనా కమలం దండుతోనే ఆయన ప్రయాణం. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే కమలనాధులు తప్ప సైకిల్ బ్యాచ్ అస్సలు కనపడదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
సంకేతాలున్నాయా?
బీజేపీ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా? అన్న అనుమానం కూడా లోకల్ లీడర్స్ లో కలుగుతోంది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ స్పీడ్ పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కూడా కమలనాధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసవర్మ ఉపాధిహామీ, పోలవరం పనుల వంటి వాటిపై టీడీపీ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. గత రెండు నెలలుగా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంపీ గోకరాజు గంగరాజుతో మంత్రి మాణిక్యాలరావు చేతులు కలపడంతో టీడీపీ, బీజేపీ మధ్య ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తొలగిపోయిందన్న ప్రచారం ఈ జిల్లాలో జోరుగా జరుగుతోంది. మొత్తం మీద గోకరాజు గంగరాజు ఈ జిల్లాలో లీడ్ తీసుకుని పార్టీని ఒంటరిపోరుకు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని రెండు పార్టీల కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.