ఎంఐఎం... ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు రాష్ట్రాలను దాటి విస్తరించింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో గెలిచింది. మహారాష్ట్రలోని కొన్ని మున్సిపాలిటీల్లోనూ కొన్నింటిని కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా కర్ణాటక, ఉత్తర భారతంలోనూ ఆ పార్టీని విస్తరించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ యోచిస్తున్నారు. ఎంఐఎం పార్టీకి నేటితో 60 ఏళ్లు నిండాయి. ఎంఐఎం పార్టీ అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.
ఇతర రాష్ట్రాల్లోనూ....
ఎంఐఎం పార్టీని సలావుద్దీన్ ఒవైసీ 1958లో స్థాపించారు. దారుస్సలాం కేంద్రంగా కేవలం పాతబస్తీలో ఏర్పడిన ఎంఐఎం ప్రధానంగా ముస్లింల అభివృద్ధికి, వారికి జరుగుతున్న అన్యాయాలను నినదించేందుకే ఏర్పడిందన్నది ఆనాటి సాలార్ సాబ్ మాట. సలావుద్దీన్ ఒవైసీ మరణించిన తర్వాత ఆయన పెద్దకుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఎంఐఎకు ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 44 మంది కార్పొరేటర్లున్నారు. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ బాధ్యతలను చేపట్టిన తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసే దిశగా కృషి చేశారు.
పాతబస్తీలో సందడే సందడి.....
మార్చి 2వ తేదీతో అరవైఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుక చేసుకున్నారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే ఎంఐఎం ఏర్పడిందని, ముస్లింలు సామాజిక, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుండటానికి అవసరమైన అన్ని చర్యల కోసం పార్టీ కృషి చేస్తుందని అసదుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొంది. ఎంఐఎం తొలి నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తూ వచ్చింది. అయితే గత ఎన్నికలలో మాత్రం టీఆర్ఎస్ తో కలిసి నడిచింది. ఒవైసీ సోదరులిద్దరూ పార్టీని పకడ్బందీగా నడుపుతూ ముందుకు తీసుకెళుతున్నారు. తెలంగాణలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీ ఎంఐఎం కావడం విశేషం.