వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాబోరని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగుతున్న సంగతి తెలసిందే. అయితే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులతో సమావేశమైన జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఐదుగురు పార్లమెంటు సభ్యులు, 44 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభలోకి అడుగుపెట్టబోమని వైసీపీ నేతలు చెప్పారు.
వెళ్లినా ప్రయోజనం లేదని.....
బడ్జెట్ సమావేశాలకైనా జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారని ఆశించారు. అయితే జగన్ మాత్రం శాసనసభకు హాజరుకాకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లడానికి కూడా తాము సిద్ధమని ప్రకటించారు. శాసనసభకు వెళ్లినా ప్రయోజనం లేదని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. శాసనసభకు హాజరైనా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమకు మైకు ఇచ్చి వెంటనే కట్ చేయడం గత నాలుగేళ్లుగా జరుగుతున్నదేనని వారు అంటున్నారు.
జెండా ఊపి ప్రారంభించిన.....
అందువల్ల శాసనసభకు వెళ్లకుండా ప్రజాక్షేత్రంలోనే తాము తేల్చుకుంటామని చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకున్న తక్షణం తాము అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక జగన్ ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఢిల్లీ యాత్రను జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 5వ తేదీన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన చేయనున్నారు. ఇందుకోసం జగన్ పాదయాత్ర చేస్తున్న దగ్గర నుంచే వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో జరగనున్న ఆందోళనలో పాల్గొనడానికి ఇప్పటికే నేతలు రైళ్లలో బయలుదేరి వెళ్లారు.