ఉప్పు...నిప్పులా తయారైన ఎంపీ, ఎమ్మెల్యేలు

Update: 2017-10-06 14:30 GMT

ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యుల మధ్య సఖ్యత లేదు. అధికార టీడీపీలో ఇది కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకుంటుండటంతో నియోజకవర్గాల్లో ముఠాలు తయారయ్యాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులను తమకు తెలియకుండా ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యేలు, తమ ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యేలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్లమెంటు సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఇది తలనొప్పిగా మారింది. ఇటీవల కాలంలో కేవలం నిధుల కోసమే ఈ రగడ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. దీన్ని గమనించిన చంద్రబాబు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఎవరి నియోజకవర్గంలో వారు పట్టు సాధించుకునే ప్రయత్నం చేయాలని, అలాగే ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

నిధుల కోసమే కొట్లాటా?

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి అక్కడి ఎమ్మెల్యలకు పడటం లేదు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్పకు ఎమ్మెల్యేలు పల్లె రఘునాధరెడ్డి, పార్ధసారధిలు ఉప్పు, నిప్పుల్లా తయారయ్యారు. ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఎమ్మెల్యేలకు కూడా దూరం పెరిగింది. ఇక రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ కు ఎమ్మెల్యేలకు మధ్య నిధుల కేటాయింపుల్లో వివాదాలు తలెత్తాయి. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యలేకు దూరం పెరగడం, వివాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఎంపీలు సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే ఇన్ ఛార్జి మంత్రికి చెప్పాలని, వారు వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అలాగే ఎంపీలు కూడా తాము కేటాయించే నిధులు ఎమ్మెల్యేలతో చెప్పి చేస్తే బాగుంటుందని సూచించారు. ఇద్దరి మధ్య సమన్వయం లేకుంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై అందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

Similar News