రెండు రాష్ట్రాల్లో తమపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఉద్యమ నేతలను ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా... పాదం కదిపినా... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహించడం లేదు. ఇది ప్రభుత్వాల బలహీనతా? లేక ఉద్యమనేతలు తమ ఉనికిని దెబ్బతీస్తున్నారన్న భయమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే వైఖరిని అవలంబిస్తుండటం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ లు ఉద్యమనేతలను బయటకు అడుగు పెట్టనీయడం లేదు. పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేస్తున్నారు. వారి గొంతుకలను బలవంతంగా నొక్కేస్తున్నారన్నది ప్రజాభిప్రాయం. వివరాల్లకి వెళితే ఏపీలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. ఇందుకోసం పాదయాత్రను తలపెట్టారు. దాదాపు రెండు నెలల పాటు ముద్రగడ పాదయాత్రను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇక్కడ పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోవడానికి ముద్రగడ ససేమిరా అంటున్నారు. అనుమతి లేదన్న కారణంగా పాదయాత్రతో పాటు ఇటీవల ముద్రగడ చేపట్టిన ఆత్మీయ యాత్రను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడను గృహనిర్భంధం చేశారు.
ఇక్కడ కోదండరామ్....
ఇక తెలంగాణలో జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అమరవీరుల స్ఫూర్తియాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాని ఇక్కడ కోదండరామ్ తన యాత్ర కోసం పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ససేమిరా అంటున్నారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని కలిసినా ప్రయోజనం లేదు. ఆరో విడత అమరవీరుల స్ఫూర్తియాత్రను పోలీసులు ప్రారంభానికి ముందే అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన శాంతిభద్రతలకు విఘాతం కల్గించరు. కాని ప్రభుత్వం మాత్రం తమపై దుష్ప్రచారం చేస్తున్నారని భావించి కోదండరామ్ యాత్రను తరచూ అడ్డుకుంటోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ కారులను అణిచివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.