అంగట్లో పెట్టి పసివారిని అమ్మేస్తున్నారు. మగబిడ్డ కావాలంటే 8 లక్షల రూపాయలు, ఆడబిడ్డ కావాలంటే 6 లక్షల రూపాయలు. ఇలా సాగుతుంది వ్యాపారం. చాలా కాలంగా ఉత్తరాంధ్రలో పసివారిని అమ్మేస్తున్న సంఘటనలు పలు సందర్భాల్లో వెలుగు చూశాయి. ప్రభుత్వం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పేదరికం, నిరక్షరాస్యత ఉత్తరాంధ్రలోని కన్న తల్లుల పేగుబంధాన్ని అమ్మకానికి పెట్టేలా చేస్తున్నాయి.
శ్రీకాకుళంలో ఐసిడిఎస్ అధికారులకే బిడ్డలను అమ్మబోయి ...
శ్రీకాకుళంలో రాధ అనే మహిళ సాక్షాత్తు ఐసిడిఎస్ అధికారులకే పసిపిల్లలను అమ్మకానికి పెట్టి అడ్డంగా దొరికిపోయింది. పసివారి అమ్మకాలపై అధికారులకు ఫిర్యాదు రావడంతో రాధ ఇంటికి వారు ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్ళి మాటా మాటా కలిపి కూపీ లాగారు. తన వారు నిజంగానే పిల్లలను కొనేవారేనని నమ్మి ఆమె మగపిల్లోడు 8 లక్షలని, ఆడపిల్ల 6 లక్షలని బేరం పెట్టింది. వెంటనే వారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ త్రివిక్రమ రావు కి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో స్థానిక టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రాధను అదుపులోనికి తీసుకుని ఆమె ఇంట్లోని నాలుగేళ్ల పసివారిని రక్షిత కేంద్రానికి పంపి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పసివారిని విక్రయాలు జరిపే ముఠాలు ఇంకా ఉన్నాయని వారి ఆట కట్టించాలని కోరుతున్నారు. మహిళల్లో చైతన్యం కలిగించడం, వారిని అక్షరాస్యత వైపు నడిపించడానికి ప్రభుత్వం కృషి చేయాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.