ఉత్తర కుమారులొస్తే... ఊరంతా సంబరాలు...!

Update: 2018-02-12 10:30 GMT

సాధించింది ఏమీలేదు. కేంద్రం ఇచ్చిందీ ఏమీలేదు. కానీ.. ఏపీలో తెలుగు దేశం పార్టీ నేత‌లు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. అయిన వాళ్ల‌కు విందులు కూడా ఇస్తున్నారు. దీంతో నెటిజ‌న్ల‌కు చిర్రెత్తుకొస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలోని కొంద‌రు టీడీపీ ఎంపీల‌పై బాహాటంగానే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమ‌లు చేయ‌డం అనే విష‌యాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. దీంతో నాలుగేళ్లు గ‌డిచిపోయిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ ఏపీకి ఒన‌గూరిన ల‌బ్ధి ఏమీ క‌నిపించ‌డం లేదు. నిజానికి 2014లో ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఏపీకి రావాల్సిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం నెర‌వేర్చాల్సిన హామీల‌పై కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదిశ‌గా ఒక్క అడుగు కూడా వేయ‌లేదు. అంతేకాదు, ప్ర‌త్యేక హోదా జన సంజీవ‌ని అని హోదాతో రాష్ట్రం వెలిగిపోతుంద‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఏమైందో ఏమో హోదా ఏమ‌న్నా సంజీవ‌నా? అని ప్ర‌శ్నించారు.

ప్యాకేజీ ముద్దంటూ ప్రచారం....

అంతేకాదు, హోదా బ‌దులు ప్యాకేజీ ఇస్తామ‌ని కేంద్రం చెప్పింది. హోదావ‌ద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ ప్ర‌చారం చేయించారు.ఈ క్ర‌మంలోనే కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని మా బ‌లేగా ఉందంటూ ప్ర‌స్తుతించారు. ఇంతా బాగానే ఉంది. ఇప్పుడు గిర్రున నాలుగేళ్లు తిరిగే స‌రికి మ‌రో ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉండే స‌రికి ఇప్పుడు బాబుకు మంట‌పుడుతోంది. రేపు ఎన్నిక‌ల‌కు ఏవిధంగా వెళ్లాలి ? విభ‌జ‌న హామీల‌పై ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మాధానం చెప్పాలి ? అని ఆయ‌న తెగ ఫీల‌య్యారు. ఈ క్ర‌మంలో బ‌డ్జెట్ స‌మావేశాల్లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేయించారు. పార్ల‌మెంటులో ఎంపీలతో ఆందోళ‌న‌కు తెర‌దీయించారు. అయినా కూడా కేంద్రం చెప్పిన మాటే చెప్పి.. పాడిన పాటే పాడి ఏపీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. దీంతో ఇప్పుడు ఆందోళ‌నల ప‌ర్వం మార్చి 5కు వాయిదా ప‌డింది.

ఏం రాబట్టారని....

క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఇలా ఉంటే..పార్ల‌మెంటు స‌మావేశాలు ముగించుకుని గుంటూరుకు చేరుకున్న టీడీపీ ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రామ్మోహ‌న్ నాయుడు మాత్రం సంబరాల్లో మునిగి తేలారు. రంగులు జ‌ల్లుకున్నారు. దిష్టి తీయించుకున్నారు. పోనీ.. వీరు ఏమైనా కోట్ల‌కు కోట్లు నిధులు రాబ‌ట్టారా? అంటే అదీ లేదు. మ‌రి ఈ సంబ‌రాలు ఎందుకు? ఏం సాధించార‌ని సంబ‌రాలు చేసుకున్నారు? అంటే.. పార్ల‌మెంటులో ఏపీ వాణి బ‌లంగా వినిపించాం కాబ‌ట్టి సంబ‌రాలు అని చెప్పుకొచ్చారు. అసలు వాస్త‌వానికి మాట్లాడ‌మ‌ని, ఏపీకి రావాల్సిన‌వి రాబ‌ట్ట‌మ‌నే క‌దా ఏపీ ప్ర‌జ‌లు ఓట్లేసి వీరిని పార్ల‌మెంటుకు పంపింది. వారి డ్యూటీ వారు చేస్తేనే ఇలా సంబ‌రాలు చేసుకోవాలా? అని నెటిజ‌న్లు కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. సో.. చేసింది ఏమీ లేక‌పోయినా.. సంబ‌రాలు చేసుకోవ‌డం పై మాత్రం స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్యక్త‌మ‌వుతోంది. మ‌రి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Similar News