ఉత్తమ్ కు లైన్ క్లియర్ అయినట్లుందే...!

Update: 2018-01-03 11:30 GMT

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాగా ఉన్నారు. తన పదవికి వచ్చే ముప్పేమీ లేదని ఆయన భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పీసీసీలో మార్పులు, చేర్పులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తమ్ పదవీ కాలం కూడా పూర్తయింది. అందుకోసమే పీసీసీ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. సీనియర్ నేత జానారెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, కోమటి రెడ్డి బ్రదర్స్ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. పెద్దయెత్తున ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేస్తున్నారు.

ఉత్తమ్ నే కొనసాగించాలని....

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పట్లో తప్పించే పరిస్థితులు లేవంటున్నారు విశ్లేషకులు. రాహుల్ కు అందిన నివేదిక ప్రకారం కూడా ఉత్తమ్ అందరినీ కలుపుకుని పోతూ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళుతున్నట్లు తేలడంతో ఎన్నికల వరకూ ఉత్తమ్ నే కొనసాగించాలని రాహుల్ టీం భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 70సీట్లు దక్కడం ఖాయమని తేలింది. అంతేకాకుండా దక్షిణ తెలంగాణలో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా సర్వేలో తేలడంతో ఇప్పటికిప్పుడు నాయకత్వాన్ని మార్చడం అనవసరమని అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

మంచి మార్కులే పడ్డాయి....

మరోవైపు రాహుల్ కొత్త టీంతో ఎన్నికలకు వెళతారన్న ప్రచారంతో ఉత్తమ్ ప్రత్యర్థులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, జాతీయ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజులు ఉత్తమ్ కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంపై ఉత్తమ్ చూపిన చొరవను పార్టీ మంచి మార్కులు వేసింది. అందరినీ కలుపుకుని పోయే నేతను తప్పించడం వేస్టన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు జనవరిలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న గుసగుసలు కూడా విన్పిస్తున్నాయి. వీరంతా ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే టచ్ లో ఉన్నారు.

Similar News