ఏఐఐసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ లేఖ రాశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు కోసం పార్లమెంట్లో చర్చ జరిపి బిజెపి చేత ఇచ్చిన హామీలు చట్టంలో వున్నవి అమలు చేసేలా కృషి చేయాలని ఉండవల్లి కోరారు. గత ప్రధాని ఇచ్చిన హామీలు ప్రస్తుత ప్రధాని అమలు చేయాలా? లేదా ? చట్టం చేయబడిన కీలక అంశాలు గత ప్రభుత్వం చేసినవి తరువాత వచ్చే ప్రభుత్వాలు అమలు చేయాలా లేదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ఉండవల్లి.
చలో అసెంబ్లీ పై ఇదేమి ధోరణి ....
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రత్యేక హోదా డిమాండ్ తో చలో అసెంబ్లీ ని విపక్షాలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎంతో రాద్ధాంతం సృష్టించిందని ఉండవల్లి దుయ్యబట్టారు. ప్యాకేజి అన్నది బ్రహ్మపదార్ధం వంటిదని, ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు అయినా ప్యాకేజి ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. కనీసం అసెంబ్లీలో రెండు రోజులు ప్యాకేజి కోసం ప్రభుత్వం చర్చ జరుపుతామని ప్రకటించడాన్ని ఉండవల్లి స్వాగతించారు.
ప్రజలపై అప్పు పెడతారా ?
ఇక పోలవరం ప్రాజెక్ట్ ను విభజన చట్టం ప్రకారం కేంద్రం కట్టి ఇవ్వాలని కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ప్రజల నెత్తిన అప్పులు పెడుతుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్ట్ కోసం గడ్కరీ చుట్టూ తిరగడం ఏమిటని నిలదీశారు ఉండవల్లి. పోలవరం పేరు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని వాపోయారు అరుణ కుమార్. పోలవరం పై కానీ రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.
పేదల ఇళ్ల పేరుతో దోపిడీ ...
19 లక్షల మేర పేదవారి ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రభుత్వం గొప్ప చెబుతుందని కానీ వెనుక చాలా కధే దాగివుందన్నారు ఉండవల్లి. చదరపు అడుగుకు తెలంగాణ లో పదకొండు వందల రూపాయలు ఉంటే మన రాష్ట్రంలో 2200 రూపాయలు కావడం ఘోరమన్నారు. నెల్లూరు కి చెందిన జమీన్ రైతు లో బాబు, వైసిపి వైఫల్యాన్ని ఎండగట్టారని చూపించారు ఉండవల్లి . చంద్రబాబు, జగన్ తోడు దొంగలని ఆ పత్రిక రాసినా కనీసం కౌంటర్ కూడా టిడిపి నుంచి లేదన్నారు అరుణ కుమార్ . విభజన సమయంలో కాంగ్రెస్ అత్యాచారం చేస్తే , బిజెపి అన్యాయం చేస్తుందని విమర్శించారు ఉండవల్లి .
పట్టిసీమ 16 నెలలు అయితే ...
ఎత్తిపోతల పధకానికి 16 నెలలు పడితే పోలవరం వంటి భారీ ప్రాజెక్ట్ కోసం మరింత సమయం పడుతుందని తెలిసినా అబద్ధాలు ఎందుకు చెబుతున్నారన్నారు ఆయన. త్వరలో మొత్తం పోలవరం , ప్రాజెక్ట్ పై పట్టిసీమ , పురుషోత్తమ పట్నం, ప్రాజెక్టులపై పుస్తకం వేసి ప్రజలను చైతన్య పరుస్తానని అరుణ కుమార్ తెలిపారు. పుష్కరాల తొక్కిసలాట ఘటన కమిషన్ వేసి ఎలా తొక్కేశారో అలాగే పోలవరం చేస్తారేమో అన్న ఆందోళన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ కుమార్.
2018 మే నాటికి పోలవరం పూర్తి కాకపోతే ...
ఇప్పటికి ఆరునెలల కాలం లోపు పూర్తి కావలిసి ఉందని లేనిపక్షంలో నాబార్డ్ ఇచ్చిన డబ్బుకు వడ్డీ చెల్లించాలన్నారు. అలాగే కేంద్రం పోలవరానికి ఇచ్చే గ్రాంట్ గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే అప్పుగా మారిపోతుందని ఇది రాష్ట్ర వాసులకు పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు తెలియ చెప్పాలని పోలవరం పైనా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రం ప్రకటించాలన్నారు.