ఉండవల్లి మరోసారి ఉతికేశారే...!

Update: 2018-01-05 09:41 GMT

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, తద్వారా ఇబ్బందులను ప్రజలతో పంచుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. నెలల కాలంలో కేవలం ఎర్త్ వర్క్ 5శాతం,కాంక్రీట్ వర్క్ 6శాతం,గేట్లు పని 5శాతం పూర్తయిందని అలాంటప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని ఎలా చెబుతారని ఆయన ప్రశించారు. నిజానికి ప్రాజెక్ట్ దగ్గర ఏపనీ జరగడం లేదని, అయితే అక్కడకు చూడ్డానికి వెళ్లివచ్చిన వాళ్ళు సైతం శరవేగంగా పనులు అవుతున్నాయని సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టు ఉంటుందో ఊడుతుందో, అసలు పనులు ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి తోడు నితిన్ గడ్గరి దగ్గర రాష్ట్ర ప్త్రభుత్వం,పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు బిల్లులు ఇచ్చినట్లు చెబుతున్న పనికి అక్కడ జరిగిన పనికి పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. పనులు చేయకుండా బిల్లులు ఇచ్చేశారనే అంశంపై తనకు వచ్చిన సమాచారం మేరకు ఆరోపణ చేస్తే, దానికి కూడా సమాధానం ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. 9.2 హిల్ దగ్గర చేసిన పనికి చెబుతున్న దానికి, బిల్లులకు తేడా ఉందని ఆయన ఆరోపించారు. 2019కి కూడా ప్రాజెక్ట్ పూర్తికాదని డిసెంబర్ 28న వచ్చిన కేంద్ర పరిశీలనా బృందం చెప్పేసిందని ఆయన గుర్తు చేసారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం వేరని, మోసం చేయడం, వంచించడం వేరని ఉండవల్లి పేర్కొంటూ మోసాన్ని , వంచనను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.

వెబ్ సైట్ ఎక్కడ?

పోలవరం ప్రాజెక్ట్ కి అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరించాలంటూ డాక్టర్ కెవిపి రామచంద్రరావు వేసిన పిటిషన్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అవును కేంద్రమే భరించాలని చెబితే సరిపోతుందని అదికూడా చేయకపోవడం చూస్తుంటే అసలు లొసుగు ఎక్కడుందో అర్ధం కావడం లేదన్నారు. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్ గురించి కేంద్రమంత్రి ఇటీవల ప్రకటన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 3వేల 7కోట్లు ఖర్చు చేస్తే,గత మార్చి 2017నాటికి 3వేల364కోట్లు, మరోసారి 979కోట్లు విడుదల చేశామని,మరో 318కోట్లు మంజూరు చేశామని చెప్పుకొచ్చారని,అంటే అదనపు సొమ్ము ఇచ్చినట్లు కేంద్రం చెబుతుంటే, డబ్బులు లేవని, వాహనాలకు ఆయిల్ కూడా లేదని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారని, అసలు వాస్తవం ఏమిటో చెప్పమంటే వెబ్ సైట్ లో పెట్టమంటూ ఓపెన్ కానీ వెబ్ సైట్ గురించి సీఎం చెబుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేసారు. పోలవరం ఆలస్యం వలన నష్టం లేదని, క్వాలిటీ లేకుండా హడావిడిగా పనులు చేయడం వలన తీరని నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విఫలం అవ్వడం వేరు, మోసం చేయడం వేరు అని ఆయన పేర్కొంటూ చేసిన మోసం నుంచి బయట పడలేరన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెబుతూ శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన కోరారు. కాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా రాకముందు దేశంలో లక్షా 31వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా, పదేళ్ల కాలంలో రెండు లక్షల 84వేల మెగా వాట్లకు చేరిందని, అందుకే దేశంలో పుష్కలంగా కరెంట్ ఇస్తున్నారని, తెలంగాణాలో కూడా 24గంటల విద్యుత్ కి ఇదే కారణమని అయన చెప్పారు.

Similar News