ఆర్కేనగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కావడంతో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వచ్చేసింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఓటర్లను ప్రలోభపెట్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు మొత్తం 16 మందితో కూడా నిఘా బృందాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నిరంతరం నిఘాను ఏర్పాటు చేస్తాయి. గతంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రాత్రిపూట విచ్చలవిడిగి ఓటర్లకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి పూట ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ ఆర్కే నగర్ లో నిషేధించింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ మాత్రమే పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ.....
ఇప్పటికే ఆర్కేనగర్ లో ఏర్పాటయిన ప్రత్యేక బృందాలు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. ఆర్కే నగర్ లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో మొత్తం 11 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చే వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఆర్కే నగర్ లోకి అనుమతించడం లేదు. గోడలమీద పోస్టర్లను తొలగించేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో ప్రత్యేక పోలీసులను నియమించారు. వీరు ప్రతి వీధిలోనూ ఉండి ఓటర్లకు డబ్బులు పంచకుండా చూస్తున్నారు. ఇక ఓటర్లకు డబ్బులు పంచితే వెంటనే తమకు ఫోన్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. 1950, 1913 నెంబర్లకు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఈసారి సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. గతంలో జరిగిన తప్పులు పునరావృత్తం కాకుండా చూస్తోంది.
ి