ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లు సమానంగా విజయం సాధించారు. కేవలం పార్టీ అభ్యర్థులనే కాకుండా దమ్మున్న అభ్యర్థులుగా స్వతంత్రులుగా నిల్చున్నా వారికి అండగా నిలబడింది. అదే దర్శినియోజకవర్గం. 1955లో దర్శి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు గెలిచింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు మూడు సార్లు విజయం సాధించారు. అయితే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలిసారిఎన్నికల్లో ఓటమి పాలయింది. అంటే ఈ నియోజకవర్గంలో వైసీపీ బోణీ కొట్టలేదన్న మాట.
బలమైన క్యాడర్.....
అయితే దర్శినియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి శిద్ధారాఘవరావుపై కేవలం 1374 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. స్వల్ప తేడాతో ఓటమి పాలవ్వడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతుంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాను ఈసారి పోటీ చేయనని ప్రకటించారు. దీంతో కొత్త అభ్యర్థిని జగన్ ప్రకటించాల్సి ఉంది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జగన్ వెంట పాదయాత్రలో నడుస్తున్నారు. ఆయన పార్టీ విజయానికి కృషి చేస్తారని చెబుతున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్......
జగన్ పాదయాత్ర నేడు దర్శి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. బోణీ కొట్టని నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సక్సెస్ చేసి ఈసారి ఫ్యాన్ గుర్తు విజయం సాధించాలని వైసీపీ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. జగన్ పాదయాత్ర ఈరోజు ఉదయం చీమకుర్తి మండలం గడపత్రివారి పాలెం నుంచి బయలుదేరి దర్శి మండలంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి శివరాంపురం చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత కొర్రపాటి వారిపాలెం క్రాస్ రోడ్స్ మీదుగా తాళ్లూరుకు చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జగన్ రాత్రికి తాళ్లూరులోనే బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర కోసం దర్శినియోజకవర్గం వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.