సింగరేణి ఎన్నికలు ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. సింగరేణి ఎన్నికలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. మంత్రులను, ఎంపీలను కూడా రంగంలోకి దించారు. తాను కూడా స్వయంగా రంగంలోకి దిగి సింగరేణి కార్మికులనుఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రెండు డివిజన్లలో టీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మికసంఘం ఓటమి పాలు కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే ఓటమి పాలయినట్లు నిర్ధారణకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు మొత్తం 11 డివిజన్లలో జరిగాయి. ఇందులో 9 డివిజన్లలో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించగా, రెండింటిలో ఏఐటీయూసీ గెలుపొందింది. ఆ రెండు డివిజన్లలో ఓటమికి గల కారణాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోస్ట్ మార్టం నిర్వహించారు.
సింగరేణి ఎన్నికల ఫలితం......
ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పై నల్లాల ఓదేలు పై ఉన్న వ్యతిరేకత వల్లనే ఓటమి పాలయ్యామని కేసీఆర్ నిర్ధారణకు వచ్చారు. అయితే నల్లాల ఓదేలు వర్గం అధికార పార్టీ నేతల కారణంగానే ఓటమి చెందామని చెబుతున్నప్పటికీ కేసీఆర్ నమ్మడం లేదు. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఎమ్మెల్యేపై వ్యతిరేకత వల్లనే ఓటమిపాలయినట్లు రావడంతో వచ్చే ఎన్నికల్లో నల్లాల ఓదేలుకు టిక్కెట్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు ప్రభావం చూపనుండటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారట. ఇక మరో డివిజన్ భూపాలపల్లి. భూపాలపల్లి నియోజకవర్గానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండటంతో సింగరేణి కార్మికసంఘ ఎన్నికల్లో మధుసూదనాచారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. మధుసూదనాచారి కుమారులు అక్కడ ప్రచార బాధ్యతలు చేపట్టారు. వారిపైన కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన కేసీఆర్ వచ్చేసారి మధుసూదనాచారి పెద్దల సభకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సింగరేణి ఎన్నికల ఫలితాలు ఇద్దరు ఎమ్మెల్యేల సీటుకు ఎసరుపెట్టాయని చెప్పక తప్పదు.