టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వదలడం లేదు. ఎమ్మెల్యేలనే కాదు.. మాజీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలనుకోవడం, సర్వేల్లో అందుతున్న సమాచారం మేరకు పలుకుబడి ఉన్న నేతలను పార్టీలోకి లాగేందుకు అనేక యత్నాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలపై టీడీపీ దృష్టి పెట్టింది. నెల్లూరులో వైసీపీకి గట్టిపట్టుంది. అందుకోసం నెల్లూరు జిల్లానే టార్గెటి్ చేసింది టీడీపీ. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో ఇందులో కోవూరు, ఉదయగిరి లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈసారి పార్లమెంటుతో పాటు నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు కైవసం చేసుకోవాలన్నది టీడీపీ వ్యూహం.
ఇద్దరు నేతలకు గాలం....
ఇందుకోసం కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డితో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. ఆయన పార్టీలోకి వచ్చేందుకు రెడీ అనిచెప్పేశారు. అలాగే కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీందర్ రెడ్డిని కూడా టీడీపీ లైన్లో పెట్టింది. వారం రోజుల క్రితం హైదరాబాద్ లో ఈసమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కందుకూరు టిక్కెట్ మానుగుంట మహేందర్ రెడ్డికి కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నియోజకవర్గంలో 2014లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఆయనపై ఇప్పటికే నియోజకవర్గలో అసంతృప్తి ఉంది. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత దివిశివరామ్ ఉన్నారు. ఆయనకు, మానుగుంటకు అసలు పడదు. ఈ నేపథ్యంలో మానుగుంట పార్టీలోకి వస్తే దివిశివరాం పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే శివరాంకు ఎమ్మెల్సీ పదవిఇస్తామని టీడీపీ నేతలు నచ్చజెప్పే అవకాశముంది. ఇక కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి వెళ్లిన వారే. 2014 ఎన్నికలకు ముందే వంటేరు టీడీపీని వీడీ వైసీపీలో చేరారు. అక్కడ టిక్కెట్ రాలేదు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అభ్యర్థిగా ఉండటంతో ఆయన గెలుపునకు వంటేరు కృషి చేశారు. తర్వాత వంటేరు, రామిరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో కావలి వైసీపీలో తీవ్రస్థాయిలో మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఈ విషయం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయితే వైసీపీలో అసంతృప్తితో ఉన్న వంటేరును పార్టీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదం మస్తాన్ రావులు వీరితో చర్చలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబు నుంచి కూడా వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మాజీలను కూడా పార్టీలో చేర్చుకుని సింహపురిలో సింహనాదం మోగించాలన్నది టీడీపీ ఆలోచనగా ఉంది.