వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. అనంతపురంలో ఆయన ప్రవేశించక ముందే టీడీపీ దెబ్బ కొట్టింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని టీడీపీలోకి చేర్చుకుని జగన్ కు షాక్ ఇచ్చింది. అనంతపురంలో జగన్ కు గత ఎన్నికల్లోనూ పెద్దగా సీట్లు రాలేదు. కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక ఒకే ఒక్క ఎమ్మెల్యే అనంతపురం జిల్లాలో జగన్ కు మిగిలారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురంలో దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగే అవకాశముంది. తన రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువమంది అనంతపురం జిల్లాలోనే ఉన్నారు. ముఖ్యంగా జేసీ బ్రదర్స్ జగన్ పై ప్రతిరోజూ విరుచుకు పడుతున్నారు. అలాగే పయ్యావుల కేశవ్ , పరిటాల ఫ్యామిలీ లకు కూడా అనంతపురం జిల్లాలో పట్టుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసి ఈసారి ఎలాగైనా ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.
గుత్తి నుంచి ప్రారంభం...
ఇప్పటి వరకూ కడప, కర్నూలు జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరిగింది. ఇప్పడు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కర్నూలు జిల్లాలో 18 రోజుల పాటు జగన్ పర్యటించారు. 26వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో యాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత గుత్తి కి పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడే మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. సాయంత్రం 4గంటలకు గుత్తి గాంధీ చౌక్ లో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఈరోజు రాత్రికి జగన్ గుత్తిలోనే బస చేస్తారు. మరి అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు తెచ్చి పెడతాయో లేదో చూడాలి.