సింహపురి లో ఆయన కోసం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఆయన రాక కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాయి. ఆయన వస్తే... పార్టీకి బలం చేకూరుతుందని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలు పోటీ పడుతున్నాయి. ఆయనే ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిశ్రామిక వేత్త. రెండు చేతులా సంపాదించేశారు. డబ్బు మూలుగుతుంది. దీంతోపాటు ఆయన సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లా అంతటా విస్తృతంగా చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలం ఎక్కువ. దీంతో పాటు వేమిరెడ్డి సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో తన సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. నెల్లూరుజిల్లా మొత్తానికి దీనిని విస్తరించాలనుకుంటున్నారు. వీటితో పాటు స్వచ్ఛంద సేవాసంస్థను ప్రారంభించారు. వీపీఆర్ ఫౌండేషన్ పేరిట అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజల మన్ననలను చూరగొంటున్నారు. అయితే ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరు.
రెండు పార్టీలకూ టచ్ లో......
గతంలో వైసీపీకి సానుభూతి పరుడిగా ఉండేవారు. గత ఎన్నికల్లో వైసీపి అభ్యర్థులకు ఆర్థికంగా సాయం చేశారనికూడా చెబుతారు. అయితే వైసీపీ గతంలో రాజ్యసభ ఇస్తామనిచెప్పింది. కాని ఒకే ఒక సీటు కావడంతో అది విజయసాయి రెడ్డికి వెళ్లింది. దీంతో వేమిరెడ్డి కొంత అసంతృప్తికి గురయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు వేమిరెడ్డికి గాలం వేస్తున్నారు. వేమిరెడ్డి వస్తే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం ఇస్తామని చెబుతోంది. వీపీఆర్ ఫౌండేషన్ జరిగే కార్యక్రమానికి వేమిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. అయితే ఆయన వస్తానని చెప్పి కొన్ని కారణాలతో వాయిదా పడింది. రెండుసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడటంతో ఆయన టీడీపీపై కూడా అసంతృప్తితో ఉన్నారట. అయితే టీడీపీ స్థానిక నేతలు మాత్రం వేమిరెడ్డి రాకను ఇష్టపడటం లేదన్న కారణం కూడా ఉంది. వేమిరెడ్డి వస్తే తమకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించడమే ఇందుకు కారణం. దీంతో పార్టీ హైకమాండ్ వేమిరెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఇది గమనించిన వైసీపీ కూడా గతంలో జరిగిన పొరపాటు చేయబోమని చెబుతోంది. ఇటీవల ఇద్దరు వైసీపీ సీనియర్ నేతలు కలిసి వేమిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నంచేశారని సమాచారం. మొత్తం మీద ఒక పారిశ్రామిక వేత్తను తమ పార్టీలో చేర్చుకోవడం కోసం రెండు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి వేమిరెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.