ఈ స్టోరీ చదివితే మీరు అవాక్కవ్వాల్సిందే...!

Update: 2017-11-19 11:19 GMT

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఈకాలంలో మానవ సంబంధాలకన్నా మనీకే విలువ పెరిగిపోతోంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్న ఘటనలు రోజూ అనేకం చూస్తున్నాం. అలాంటి రెండు దారుణాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. అనారోగ్యంతో ఇంటి యజమాని చనిపోయాడన్న బాధ ఏమాత్రం లేకుండా... పాలసీ డబ్బుల కోసం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నాటకమాడారు. అడ్డంగా దొరికిపోయారు. ఇక మరోచోట పాలసీ డబ్బుల కోసం కట్టుకున్న భార్య చనిపోయినట్టుగా చిత్రీకరించాడు మరో వ్యక్తి.

కుటుంబమంతా కలిసి....

డబ్బుల కోసం ఏజెంట్‌తో కలిసి ఓ కుటుంబమంతా ఆడిన నాటకమిది. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని రుజువు చేసే దారుణమిది. ఓవైపు ఇంటి యజమాని చనిపోతే... కన్నీళ్లు కార్చాల్సిన కుటుంబ సభ్యులు... ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చే మార్గమేంటని ఆలోచించిన ఘోరమిది. బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి మృతదేహాన్ని కారుతో ఢీకొట్టించిన ఘటన మూడు రోజుల క్రితం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో జరిగిన ఈ ఘటనలో సూత్రధారులు, పాత్రధారులంతా ఇప్పుడు కటకటాలపాలయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు సుగాలి కాలనీకి చెందిన 52 ఏళ్ల రమావత్‌ కస్నానాయక్‌... టీబీ రోగి. 15 రోజుల క్రితం నల్గొండ జిల్లా రాళ్లవాగు తండాకు చెందిన ధరావత్‌ రాజు నాయక్‌ బీమా ఏజెంట్‌... కస్నానాయక్‌ పేరు మీద పది లక్షల బీమా పాలసీ చేయించాడు. కస్నా కుటుంబానికి నాలుగు లక్షలు, ఏజెంట్‌కు ఆరు లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 15న ఉదయం కస్నా నాయక్‌ అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషయాన్ని కస్నా భార్య భద్రమ్మ ఏజెంట్‌ రాజు నాయక్‌కు తెలియజెప్పింది. వెంటనే తెనాలి చేరుకున్న ఏజెంట్‌ రాజు... సహజ మరణమైతే బీమా సొమ్ము రాదని, ఏదైనా ప్రమాదంలో చనిపోతేనే డబ్బులు వస్తాయని చెప్పాడు. అందుకే కస్నా శవానికి యాక్సిడెంట్‌ చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరిద్దామన్నాడు. డబ్బులు వస్తాయన్న అత్యాశతో కస్నా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అందరూ కలిసి కస్నా మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లారు. మల్లెపాడు రోడ్డులో ఆటోలో ఉన్న శవాన్ని రోడ్డుపై పారేశారు. వెనుక నెంబర్‌ లేని కారులో వస్తున్న ఏజెంట్‌ రాజు కారుతో మృతదేహాన్ని ఢీకొట్టాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. కారు ఢీకొని కస్నా నాయక్‌ చనిపోయాడని... అతని తమ్ముడు హనుమంత్‌ నాయక్‌కు సమాచారమిచ్చాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ఎంట్రీతో....

పోలీసుల ఎంట్రీతో యాక్సిడెంట్‌ డ్రామా బయటపడింది. బీమా డబ్బుల కోసమే శవాన్ని కారుతో ఢీకొట్టించినట్టు విచారణలో తేలింది. యాక్సిడెంట్‌ డ్రామాలో సూత్రధారుడైన బీమా ఏజెంట్‌ రాజు నాయక్‌, శ్రీనాయక్‌తో పాటు, పాత్రధారులైన కస్నా భార్య భద్రమ్మ, అల్లుళ్లు జయరామ్‌ నాయక్‌, సైదానాయక్‌లను అరెస్ట్‌ చేశారు పోలీసులు. బీమా ఏజెంట్‌ రాజు గతంలో పలు చోట్ల ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. డబ్బుపై ఆశ ఎంతకైనా దిగజారుస్తుందని, మానవత్వాన్ని కూడా చంపేస్తుందని రుజువు చేసింది ఈ దారుణం. ఇక నల్గొండ జిల్లాలో ఓ బీమా ఏజెంట్‌... పాలసీ డబ్బులు క్లెయిమ్‌ చేసుకునేందుకు కట్టుకున్న భార్య చనిపోయినట్టు చిత్రీకరించాడు. ఐదు లక్షలు నొక్కేశాడు. ఇలాగే మరికొందరి పాలసీల డబ్బుల్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. విజిలెన్స్‌ అధికారులకు ఉప్పందడంతో... సదరు ఏజెంట్‌ బాగోతం బయటపడింది.

Similar News