ఈ సీనియర్ల వల్ల అవుతుందా?

Update: 2017-11-03 00:30 GMT

తెలంగాణ టీడీపీని సీనియర్లు నడిపించగలుగుతారా? పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముప్పావు భాగాన్ని ఎప్పుడో మింగేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని టీడీపీని కంగు తినిపించారు. తాజాగా రేవంత్ రెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించడంతో పార్టీ పూర్తిగా డల్ అయింది. ఇక చేతి వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత నేతలే ఉన్నారు. వారిలో కూడా నలుగురైదుగురు మినహా మిగిలిన వారెవ్వరూ ప్రజాకర్షక నేతలు కాదు. రేవంత్ పార్టీని వీడిపోవడంతో చంద్రబాబు హడావిడిగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ తెలంగాణలో శాశ్వతంగా ఉండాలని అభిలషించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటే పార్టీ మనుగడ సాధ్యమవుతుందన్నారు. తాను ప్రతి నెల వచ్చి సమీక్షలు చేస్తామని చెప్పారు. ఇకపై ఎక్కువ సమయాన్ని తెలంగాణలో పార్టీ కోసం కేటాయిస్తామని చెప్పారు.

సమర్థ నేతలేరీ?

కాని సీనియర్ నేతలెవ్వరూ అంత సమర్థులు కాదన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే వీరు పరిమితమవుతారన్న టాక్ పార్టీలోనే బలంగా విన్పిస్తుంది. పట్టుమని పదివేల మందితో సభ ఏర్పాటు చేసే సత్తా కూడా వీరికి లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఉన్నవారిలో మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్. కృష్ణయ్య వంటి వారే ఉన్నారు. ఇట టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ కూడా అంత సమర్థుడు కాదన్నది అందరికీ తెలిసిందే. నమ్మకంగా ఉంటారనే ఆయనకు చంద్రబాబు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. రమణకు పార్టీని ముందుంచి నడపగల సత్తా లేదన్నది జగమెరిగిన సత్యం. దీంతో చంద్రబాబు ఎన్ని సార్లు వచ్చినా... ఎన్ని సమీక్షలు చేసినా.. తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనన్నది క్యాడర్ లో ఉన్న అనుమానం. అయితే చంద్రబాబు మాత్రం తెలంగాణలో పార్టీని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. చూద్దాం.... భవిష్యత్తులో ఏం జరుగుతుందో...?

Similar News