ఈ సారి టీడీపీ టార్గెట్ ఆ సీట్లేనా..!

Update: 2018-01-15 10:30 GMT

ఈ సారి తెలంగాణ‌లో తెలుగుదేశం పిరిస్థితి చాలా దారుణంగా ఉండే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో బ‌ల‌మైన కేడ‌ర్‌, నాయ‌కులు ఉండేవాళ్లు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌రిస్థితి తారుమారు అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో అక్కడ పార్టీ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటుతో పాటు 15 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు పార్టీలో ఉన్నాడో లేదో తెలియ‌ని ఆర్‌.కృష్ణయ్యను ప‌క్కన పెట్టేస్తే కేవ‌లం స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఒక్క‌రు మాత్రమే ఉన్నారు.

సీమాంధ్రులు ఉన్న చోట....

అయితే ఈ సారి పార్టీ తెలంగాణ‌లో అన్ని సీట్లలోనూ పోటీ చేసే స‌త్తా ఉందా ? అని ప్రశ్నించుకుంటే నో అనే చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద శాపం అయ్యింది. సీఎం కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బతో టీటీడీపీ విల‌విల్లాడిపోయింది. కొద్ది రోజుల క్రితం కూడా మాజీ మంత్రి ఉమా మాధ‌వ‌రెడ్డి కారెక్కేశారు. ఇక పార్టీలో అక్కడ మిగిలిన ఎల్‌.ర‌మ‌ణ‌, రావుల చంద్రశేఖ‌ర్‌రెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంగ‌తి ఎలా ఉన్నా నామా నాగేశ్వర‌రావు, మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వర‌రావు సైతం పార్టీ మారిపోతార‌ని వార్తలు వ‌స్తున్నాయి.

పొత్తు లేకుంటే....

ఇక తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలుగుదేశం అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే ప‌రిస్థితి లేదు. బీజేపీతో పొత్తు క‌ష్టమే. అదే జ‌రిగితే 119 స్థానాల్లో పోటీ క‌న్నా పార్టీ బ‌లంగా ఉన్న, సీమాంధ్రుల ప్రభావం ఉన్న ఖ‌మ్మం జిల్లాతో పాటు న‌ల్గొండ జిల్లాలో కోదాడ‌, హుజూర్‌న‌గ‌ర్‌, సూర్యాపేట సెగ్మెంట్ల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని నియోజ‌క‌వ‌ర్గాల మీదే ప్రధానంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఉన్న 25 సెగ్మెంట్ల‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టి ఇక్కడే బ‌ల‌మైన అభ్యర్థుల‌ను రంగంలోకి దింపి పోటీ చేసే అంశంపై చంద్రబాబు, టీ టీడీపీ వ‌ర్గాలు ఆలోచ‌న చేస్తున్నట్టు తెలుస్తోంది.

బలంగా ఉన్న చోటే....

ఇక మిగిలిన జిల్లాల్లో పార్టీ నాయ‌కులు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేయ‌నున్నారు. ఏదేమైనా తెలంగాణ‌లో పేరున్న నాయ‌కులు ఒక్కొక్కరు వ‌రుస‌గా ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లిపోతోంటే.. వారికి భరోసా ఇచ్చి ఆపగల తెగువ ఉన్న నాయకులు కూడా లేరు. ఇలాటి పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం అత్యంత విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ టైంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లోనూ కాన్‌సంట్రేష‌న్ చేయ‌డం కంటే పార్టీ బ‌లంగా ఉన్న చోట్లా, ఆశ‌లు ఉన్న చోట్ల, బ‌ల‌మైన నాయ‌కులు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గురి పెట్టాల‌ని టీడీపీ యోచిస్తోంది. మ‌రి ఈ ప్రయ‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ ఎంత వ‌ర‌కు ఎఫెక్ట్ చూపుతుందో ? చూడాలి.

Similar News