ఈ విషయంలో రాయపాటిదే గెలుపు...!

Update: 2017-11-02 05:30 GMT

చంద్రబాబు పోలవరం కోసం వెనక్కు తగ్గారు. పోలవరాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబు ప్రస్తుతమున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తొలగించి వేరే కంపెనీకి పనులు ఇవ్వాలని భావించారు. అయితే కేంద్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ట్రాన్స్ ట్రాయ్ నే కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ట్రాన్స్ ట్రాయ్ ను కొనసాగిస్తూనే స్పిల్ వే.. స్పిల్ ఛానల్ కోసం కొత్తగా ఈ టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఈ పనులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలను భరించాలని నిర్ణయించింది.

ట్రాన్స్ ట్రాయ్ ను కొనసాగించాలని.....

పోలవరం పార్టీకి, ప్రభుత్వానికి ముఖ్యమైనది కావడంతో అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఇందుకు కేంద్రం సహకరించకపోవడంతో కొత్త కాంట్రాక్టరును నియమించుకునేందుకు అవకాశం లేదు. కాంట్రాక్టర్ ను మారిస్తే అదనంగా ప్రాజెక్టు పై పడే భారాన్ని కేంద్రం భరించదని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇక కేంద్రాన్ని బతిమాలడకుండా పనులను మాత్రం వేగవంతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. కాంక్రీట్ పనులను వేరేసంస్థకు అప్పగిస్తే త్వరిత గతిన పనులు పూర్తయి వచ్చే ఏడాది చివరి నాటికి నీరిచ్చే అవకాశముంటుందని భావిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ ను కొనసాగిస్తూనే వెయ్యి కోట్ల విలువైన పనులను ఈ టెండర్ల ద్వారా మరో కాంట్రాక్టరుకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడే 200 కోట్ల భారాన్ని చెల్లించాలని కేంద్రాన్ని అడగాలని, ఇవ్వకపోయినా పరవాలేదని చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో పేర్కొన్నట్లు తెలిసింది. మొత్తంమీద వివాదాలకు తెరదించుతూ ట్రాన్స్ ట్రాయ్ ను చంద్రబాబు కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Similar News