ఈ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లే

Update: 2018-03-17 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఏపీ రాజకీయాలను హీటెక్కించారు. పాదయాత్రలో ఉండి కూడా జగన్ ఎప్పిటికప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ, వ్యూహాలను మార్చుకుంటూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సయితం జగన్ వేస్తున్న ఎత్తులకు డంగయిపోతున్నారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఒకవ్యూహం ప్రకారం జగన్ ముందుకెళుతుండటంతో అధికార టీడీపీ ఇరకాటంలో పడుతోంది. తొలుత నవంబరు 6వ తేదీన పాదయాత్రను ప్రారంభించిన జగన్ అప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో....

పాదయాత్రలో ప్రజల మధ్యలో ఉంటూనే ప్రత్యేకహోదా అంశాన్ని తెరమీదకు తెచ్చారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. కాని రానురాను హోదా సెంటిమెంట్ బలపడుతుండటంతో చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానకెత్తుకునేలాచేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించడం తమకు కలిసి వచ్చిందంటున్నారు. ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అధికార పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. ప్రతిపక్షం ఉంటే వారు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఛాన్స్ దక్కేది. కాని ఇప్పుడు కేవలం అసెంబ్లీ సమావేశాలు ప్రశంసలకే పరిమితమయి పోయాయి.

పవన్ ను రెచ్చగొట్టి....

మరోవైపు ఇన్నాళ్లూ చంద్రబాబుకు అండగా ఉన్న పవన్ ను కూడా రెచ్చగొట్టడంలో జగన్ పార్టీ సఫలమయిందనే చెప్పాలి. చంద్రబాబు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పవన్ వచ్చి రక్షిస్తారన్న ఒక వాదన ఉంది. వాదనే కాదు అనేక సందర్భాల్లో అదే జరిగింది. అయితే పాదయాత్రలో ఉన్న జగన్ పవన్ ను ప్రత్యేక హోదా విషయంలో కొంత రెచ్చగొట్టారు. తాను అవిశ్వాస తీర్మానం కేంద్ర ప్రభుత్వంపై పెడతానని, దానికి టీడీపీని ఒప్పించే బాధ్యతను పవన్ తీసుకోవాలని రెచ్చగొట్టారు. దీనికి పవన్ కూడా స్పందించారు. అవిశ్వాసం పెడితే తాను ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగడతానని ప్రతి సవాల్ విసిరారు.

జోడీని విడదీసి....

దీంతో పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో టీడీపీ సర్కార్ లోపాలు కూడా బయటపడటంతో పవన్ మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సమావేశంలో టీడీపీపై ఫైరయ్యారు. ముఖ్యంగా పవన్ , చంద్రబాబు కలిసి ఉంటే ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ విజయం కొంత కష్టమే. గత ఎన్నికల్లోనే అది రుజువైంది. పవన్, చంద్రబాబు జోడీ విడిపోతే తనకు అడ్వాంటేజీ ఉంటుందన్నది వైసీపీ నేతల భావన. అందుకోసమే పవన్ రెచ్చగొట్టి తమ నేత సక్సెస్ అయ్యారంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారంటున్నారు.

Similar News