వైసిపి అధినేత జగన్ విసిరిన అవిశ్వాస తీర్మానం సవాల్ ను జనసేన స్వీకరించడం, ఎవరి మద్దతు అవసరం లేకుండా సింగిల్ గానే తామే ఆ తీర్మానం చేస్తామంటూ కాంగ్రెస్ రెడీ కావడంతో టిడిపి ఈ రేసులో వెనుకబడిందంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీ అవిశ్వాసం పెడితే అవసరమైన మద్దతు తాను సమీకరిస్తానని పవన్ స్పష్టం చేశారు. ఆయన అలా చెప్పారో లేదో కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా తామే మోడీ సంగతి తేలుస్తామని పిసిసి చీఫ్ ప్రకటించడం చర్చనీయాంశం గా మారింది. అవిశ్వాసం మీద వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు వాడిగా వేడిగా చేస్తున్న ప్రకటనలను పరిశీలించిన టిడిపి అధినేత ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. అవిశ్వాసం ఆఖరి అస్త్రమని మెజారిటీ వున్న మోడీ సర్కార్ ను ఏమీ చేయలేమని ఆరునెలలు మాట్లాడే అవకాశమే లేదన్నారు. సీఎం ప్రకటనతో టిడిపి అవిశ్వాసం వైపు అడుగులు వేసేందుకు వెనుకాడుతున్నట్లు తేలిపోతుంది.
చివరివరకు కొనసాగి ....
బిజెపి సర్కార్ తో చివరివరకు పొత్తు కొనసాగిస్తూనే పార్లమెంట్ కేంద్రంగా పోరాటమే చేయాలని టిడిపి భావిస్తుంది. చివరిగా ఉపయోగించాలిసిన అస్త్రాలు ఇప్పుడే వాడేయడం అనుభవం లేనివారు చేసే పని అంటూ పరోక్షంగా జగన్, పవన్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు సిఎం. ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత తాను అవిశ్వాసానికి వ్యతిరేకమనే తీరులో వక్రీకరణ జరిగిపోయిందని డ్యామేజ్ కంట్రోల్ కి సీఎం చర్యలు చేపట్టారు. పార్లమెంట్లో ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా టిడిపి వ్యతిరేకంగా ఓటు చేయాలిసి ఉంటుంది. దాంతో ఆ పార్టీకి బిజెపితో తెగతెంపులు ముందుగానే జరిగిపోవడం ఖాయం అవుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో బిజెపి మంత్రులు రాజీనామా చేస్తారు. కేంద్ర కేబినెట్ లో వున్న టిడిపి మంత్రులు వైదొలగాలిసివుంటుంది. ఇప్పటికిప్పుడు బిజెపి సర్కార్ కి దూరంగా జరిగితే నిధుల పరంగా మరిన్ని ఇబ్బందులు ఎదురౌతాయన్నది బాబు ఆలోచన అంటున్నారు. ఎన్డీయేలో వున్నప్పుడే న్యాయం చేయని వారు పొత్తు తెగ్గొట్టుకుని పోరాడితే పట్టించుకునే పరిస్థితే ఉండదన్నది చంద్రబాబు నమ్ముతున్నారని, అందుకే తెగేవరకు లాగాలని రాబోయే ఎన్నికల వరకు బిజెపితో ఉంటూనే పోరాటం సాగించాలన్నది ఏపీ సీఎం బహుముఖ వ్యూహమని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుంది ఎవరు ముందు ఎవరు వెనుకో తేలనుంది