మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండ్రుమురళి పీసీసీ చీఫ్ పదవి కోసం కాచుకు కూర్చున్నారా? అందుకోసమే ఆయన ఏపార్టీలోకి వెళ్లకుండా వేచి చూస్తున్నారా? అవుననే అంటున్నారు కొండ్రు మురళి అనుచరులు. కొండ్రు మురళి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ కాంగ్రెస్ యువనేత కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనతో కొండ్రు మురళి భవితవ్యం చీకటిగా మారింది. 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొండ్రు మురళి విభజన ఫలితాన్ని చవిచూడక తప్పలేదు. దీంతో ఆయన మూడున్నరేళ్లుగా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మరోవైపు అనుచరుల నుంచి తీవ్ర వత్తిడి వస్తుంది. టీడీపీ, వైసీపీ ఏదో ఒకదానిలో చేరాలని మురళిపై గత కొంతకాలంగా వత్తిడి తెస్తున్నారు. మురళి వాస్తవానికి వైసీపీలోనే చేరాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
పీసీసీ రాకుంటే...వైసీపీలోకేనా?
పీసీసీ చీఫ్ పదవి నుంచి రఘువీరారెడ్డిని తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో జరిగిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ధరావత్తు కోల్పోయింది. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత రఘువీరారెడ్డిని మార్చాలని సొంత పార్టీ నేతలే గళం విప్పారు. ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ పీసీసీ పగ్గాలు దళితులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. త్వరలోనే పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని తెలియడంతో దళిత కోటాలో తనకు పీసీసీ చీఫ్ పదవి లభిస్తుందేమోనన్న ఆశాభావంతో మురళి ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి వస్తే జాతీయ పార్టీలో ఒక నేతగా చెలామణి కావచ్చన్నది మురళి వ్యూహం. అంతేకాకుండా వైసీపీలో చేరాలన్నా రాజాం నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగులు ఉన్నారు. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా జోగులు మాత్రం జగన్ నే నమ్ముకుని పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో రాజాం టిక్కెట్ జగన్ జోగులును కాదని తనకిస్తారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. అలాగే టీడీపీలో కి వెళ్లాలన్నా అక్కడ ప్రతిభాభారతి ఉన్నారు. దీంతో వైసీపీలోకే వెళ్లాలని మురళి నిర్ణయించుకున్నారు. అయితేతనకు సీటుపై గ్యారంటీ ఇస్తేనే వెళ్లాలనినిర్ణయించుకున్నారు. ఈలోపు పీసీసీ చీఫ్ పదవి పై కూడా క్లారిటీ వస్తుందని, మురళికి పీసీసీ చీఫ్ పదవి రాకుంటే వైసీపీలోకే వెళతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం మురళి పార్టీకి వస్తే జోగులుకు ఎమ్మెల్సీ ఇచ్చైనా టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద కొండ్రు మురళి పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అది రాకుంటే మాత్రం కాంగ్రెస్ ను వీడటం ఖాయమంటున్నారు.