అవును! ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాజీ టీచర్ కేఎస్ జవహర్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్టాడడమే కాకుండా తనకు ఎదరూ ఎవరూ చెప్పకూడదనే ధోరణితో ఆయన రెచ్చిపోతుండడం పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తనకు అన్ని విధాలా సాయం చేసిన కార్యకర్తలపై ఆయన నిరంకుశ ధోరణిని అవలంబిస్తుండడం తనకు ఎన్నికల్లో ఉపయోగ పడిని వారిని కూరలో కరివేపాకు మాదిరిగా తీసి పక్కన పెడుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీంతో అసలు పార్టీని ఆయన భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీ అంటేనే కార్యకర్తలు! కార్యకర్తల బలంతోనే పార్టీ పుంజుకుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
అంతా వివాదమే....
అలాంటి పార్టీని జవహర్ తన వివాద ప్రవర్తనతో నాశనం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వెలుగు చూసిన ఘటన జవహర్ ప్రవర్తనకు అద్దం పడుతోంది. మంత్రి జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్ మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రి జవహర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు టీడీపీ ఫేస్‌బుక్ పేజీలో జెడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి చెందిన కార్యకర్తలు కామెంట్స్ పెట్టారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త....
విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన మంత్రి మాట్లాడుదామని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్రప్రసాద్ అనే కార్యకర్త మంత్రి జవహర్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలోని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పుడుతున్నారని, అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రిగారు తనపై చేయి చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరించాడని సత్యేంద్రప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, గత వారం రోజులుగా మంత్రి ఈయనపై పోలీసులతో హెచ్చరికలు జారీ చేయిస్తున్నట్టుగా సమాచారం.
టీడీపీలో సంచలనమే...
మంత్రిగా బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన సమయంలో జవహల్ ఇలా కార్యకర్తలను బెదిరించడం, చేయి చేసుకోవడం టీడీపీలో సంచలనంగా మారింది. ఒకప్పుడు జవహర్.. టీచర్ మాత్రమే అయితే, బాబు మాత్రం ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. నోరు అదుపులో పెట్టుకోకుండా బీరు హెల్త్ డ్రింక్ అని వ్యాఖ్యానించినప్పుడు ఈ ఆవేశం ఏమైందో మంత్రిగారికి తెలియాలి. ప్రజల్లో ఉన్న విమర్శలను తట్టుకోగలిగే లక్షణం అలవడాలి. లేదా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంయమనం, ఓర్పు వంటి అంశాలను పార్టీ అధినేత చంద్రబాబును చూసైనా నేర్చుకుంటే బాగుంటుందే జవహర్ జీ.. అంటున్నా విశ్లేషకులు.