కొత్త జిల్లాల ఏర్పాటు అనే వ్యవహారం తెలంగాణలో ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. పదిజిల్లాల తెలంగాణను 27 జిల్లాలుగా మారుస్తూ, కొత్త రూపు అందిస్తూ.. కేసీఆర్ సర్కారు చాన్నాళ్ల కిందటే ముసాయిదాను తయారుచేసింది. అప్పటికి అదే ఫైనల్ అంటూ.. ప్రజల అభిప్రాయాలను కూడా ఆహ్వానించారు. పలుచోట్ల ఉద్యమాలు, డిమాండ్లు జరిగాయి. అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడి ముందుగా కొత్తగా మరో మూడు జిల్లాలకు కేసీఆర్ ఓకే చెప్పిన సంగతి అందరికీ తెలుసు. ఫైనల్‌గా 30 జిల్లాలు అనుకున్న తరువాత.. ఇప్పుడు మళ్లీ కొత్తగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నారాయణపేట్‌ను జిల్లా చేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి కొత్త డిమాండ్ ఇప్పుడు తెర మీదికి వచ్చింది. ఇన్నాళ్లుగా వినిపించని డిమాండ్ గద్వాల జిల్లాను కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత హఠాత్తుగా ఇప్పుడు తెరమీదికి రావడమే చిత్రమైన సంగతి. తెరాస ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి నారాయణ పేట్‌ను జిల్లా చేయాలంటూ కొత్త డిమాండ్‌ను వినిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అయినప్పటికీ ఆయన కూడా రాజీనామా అస్త్రాన్ని బయటకు తీయడం విశేషం.
నారాయణ పేట్‌ను జిల్లాగా చేయకపోతే గనుక.. తాను రాజీనామా చేస్తానని ఆయన ఇప్పటికే పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజాభీష్ట, పాలన సౌలభ్యం తప్ప రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల ఏర్పాటు చేయకూడదని తొలినుంచి అంటున్న కేసీఆర్, తమ సొంత పార్టీ ఎమ్మెల్యే చివరి నిమిషంలో వినిపిస్తున్న ఈ బెదిరింపులకు తలొగ్గుతారా లేదా తేలాల్సి ఉంది.
మరోవైపు ఖమ్మంలో భద్రాచలం ను ప్రత్యేకంగా జిల్లాగా చేయాలంటూ మరో డిమాండ్ వినిపిస్తోంది. ఆసిఫాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు గల అవకాశాల్ని పరిశీలించాలని కేసీఆర్ పురమాయించినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీఎంను బెదిరిస్తే, కాస్త హడావుడి చేస్తే కొత్త జిల్లా వస్తుందనే భావన ఎవరిలోనైనా వచ్చిందా? ఆ విషయం కేసీఆర్ స్పందన, తీసుకునే నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది.