ఏపీ జీవనాడి పోలవరంపై కేంద్రంతో అమీతుమీకి ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమైపోయారు. స్పిల్‌వే పనులకు టెండర్లు పిలవొద్దని కేంద్రం రాసిన లేఖపై ఆయన తీవ్రంగానే స్పందించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. ఆశించిన స్థాయిలో సహకారం చేయకుండా కొర్రీలు పెడుతున్నా.. తొలి నుంచి సర్దుకుపోతూ వస్తున్నానని ఇక సహనం నశిస్తోందంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఆపమంటే ఆపేస్తామని.. కేంద్రానికే అప్పజెబుతామని చెప్పడంపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే! వరుసగా సమీక్షలు చేస్తూ పనులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
తొలినుంచి తీరుపైనే విమర్శలు....
2019 నాటికి పూర్తిస్థాయిలో పోలవరాన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నానని పదేపదే చెబుతున్నారు. అయితే తొలి నుంచి కేంద్ర వైఖరి ఎలా ఉన్నా.. చంద్రబాబు తీరుపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కమీషన్ల కోసమే పోలవరం అంచనా వ్యయాన్ని పెంచారని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిం దటే.. కేంద్రమే నిర్వహణ బాధ్యత అంతా తీసుకుని దానికి అయ్యే ఖర్చును భరిస్తుంది. తాము పోలవరానికి ఆర్థిక సాయం చేస్తామంటే ఇప్పటివరకూ చంద్రబాబు ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు. మరి ఇన్నాళ్లూ ఎటువంటి అడ్డూ చెప్పని ఆయన.. ఒక్కసారిగా కేంద్రంపై రివర్స్ అవ్వడం వెనుక కారణాలేమైనా కావొచ్చు. కానీ పోలవరంపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
1. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం వ్యయం పూర్తి బాధ్యత కేంద్రానిదే కదా ? విభజన చట్టంలోనే ఈ విషయం ఉంది. ఒక్క టెండర్ ను కొన్ని రోజులు ఆపేయమంటేనే ఎందుకింత ఉలికిపాటు ?
2. కేంద్రం ఆపమన్నా ఆగకుండా టెండర్ విషయంలో ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమిటి ?
3. సోమవారం పేరు ‘పోల’వారంగా మార్చి అంతా అయిపోయింది అంటూ నమ్మించి..ఇప్పుడు కేంద్రం అడ్డుపడుతోందని చెప్పటం వెనక కారణాలేంటి ?
4. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవొచ్చా? అదీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ( పీపీఏ) అనుమతి లేకుండా ఎలా?
5. కేంద్రానికే పోలవరాన్ని మొదట్లోనే వదిలేసి ఉంటే..కష్టాల్లో ఉన్న రాష్ట్రంపై అసలు భారమే ఉండేది కాదు కదా ?
6. కమీషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం అమలు బాధ్యత తీసుకుని.. ఇప్పుడు ఓ టెండర్ విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పగానే ఎందుకింత రాద్ధాంతం చేస్తోంది ?
7. పోలవరం పూర్తయ్యే వరకూ అంటూ వేల కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఒకటి రెండు ఏళ్లు పోలవరం జాప్యం అయితే వచ్చే నష్టం ఏంటి ?
8. పోలవరం ప్రాజెక్టు విషయంలో చట్టబద్దంగా ఉన్న హక్కును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడి సాధించుకోలేకపోతోంది ?
9. స్పిల్ వే, స్పిల్ ఛానల్ లో కొంత భాగం పనులకు టెండర్ పిలిచిన తర్వాతే అంచనా వ్యయం రూ.1395.30 కోట్ల నుంచి రూ.1483 కోట్లకు ఎలా పెరుగుతుంది ?
10. పెరిగిన భూ సేకరణ వ్యయం, ప్రాజెక్టు వ్యయం ఇవ్వనన్నా చంద్రబాబు ఎందుకు ఇప్పటివరకూ అభ్యంతరం చెప్పలేదు ?
11. కొత్త పనుల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది ?
12. రాష్ట్రంపై పడే అదనపు భారం సంగతి ఏమిటి ?
13. పనులు మేమే చేపడతామని కేంద్రాన్ని అడిగి తీసుకుని …ఇప్పుడు బ్లెయిమ్ ను బీజేపీపై నెట్టేందుకు ఎత్తుగడ వేస్తున్నారా ?
14. ప్రత్యేక హోదా విషయంలో ఎలాగూ రాజీపడ్డారు కదా ?. పోలవరంలో అయినా న్యాయం చేయమని కేంద్రాన్ని గట్టిగా అడగొచ్చు కదా ?. ఆ పని ఎందుకు చేయటం లేదు ?
15. చట్టబద్దంగా వంద శాతం పోలవరం ఖర్చు మీరే భరించాలి అని ఎందుకు డిమాండ్ చేయరు ?