ఈ పెద్దాయనకు కేసీఆర్ హ్యాండిస్తారా?

Update: 2017-11-18 11:30 GMT

తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కష్టమేనని తేలిపోయింది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మధుసూధనాచారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం వ్యవస్థాపకుల్లో మధుసూధనాచారి ఒకరు. చారి అంటే కేసీఆర్ కు అపారమైన గౌరవం. అందుకే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే స్పీకర్ పదవి ఇచ్చి తానేంటో చెప్పకనే చెప్పారు కేసీఆర్. అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో మధసూదనాచారి చాలా అభివృద్ధి పనులే చేశారు. ప్రజలతో మమేకమవుతారు. ఆయనంటే అక్కడి వారికి కూడా అంతే గౌరవం. అయితే మధుసూధనాచారి కుమారుల వల్ల ఆయన అప్రదిష్టను మూటగట్టుకున్నారు. తలా రెండు మండలాలను పంచుకుని యధేచ్ఛగా వ్యవహరిస్తుంటంతో వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇది కేసీఆర్ కు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో కూడా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. దీనికి కారణం చారి పుత్రరత్నాలేనని సీఎం కేసీఆర్ గ్రహించారు. ఈ నేపథ్యంలో మధుసూధనాచారిని పక్కన పెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ పదవి గాని ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచన.

గండ్రకే టిక్కెట్ అని ప్రచారం.....

ఈ నేపథ్యంలో అక్కడ బలంగా ఉన్న గండ్ర సత్యనారాయణరావును టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. గండ్ర సత్యనారాయణరావు మొన్నటి దాకా టీడీపీలో ఉండేవారు. ఆయన రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళదామనుకున్నారు. అయితే అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆయనకు టిక్కెట్ ఖచ్చితంగా వస్తుంది. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు కొందరు గండ్ర వెంకటరమణారెడ్డిని పరకాల వెళ్లాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో టిక్కెట్ గండ్ర సత్యనారాయణరావుకు కష్టమని చెప్పారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇందుకు ఆయన ఒప్పుకోకుండా టీఆర్ఎస్ లోకి వెళ్లారు. టీఆర్ఎస్ లో చేరే ముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ హామీ ఇస్తేనే గండ్ర వెళ్లాలనినిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ వినోద్ కుమార్ లు రాయబారం నడిపి కేసీఆర్ తో మాట్లాడి ఒప్పించారని, వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టీఆర్ఎస్ టిక్కెట్ గండ్ర సత్యనారాయణరావుకేనని చెప్పడంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నట్లుప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పీకర్ మధుసూధనాచారి అసంతృప్తితో ఉన్నారట. కేసీఆర్ స్వయంగా సముదాయించినా ఆయన అంగీకరించలేదని తెలిసింది. మధుసూధనాచారి కుమారులు కూడా తండ్రిపై వత్తిడి తెస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తమలో ఒకరికి టిక్కెట్ దక్కాలని వారు కోరతున్నారు. మొత్తం మీద భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Similar News