ఈ దేశ రెండో రాజధాని అమరావతి కాబోతుందా ...?

Update: 2017-12-05 05:30 GMT

ఏపీ పునర్విభజనతో ఆంధ్రా కు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ నష్టాన్ని భర్తీ చేసి ఆదుకుంటుంది అనుకుంటే టిడిపి ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ ఆడుకుంటుంది. దాంతో ఏపీకి సారధ్యం వహిస్తున్న అపార అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త అయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి దిక్కు తోచని పరిణామాలు ఎదురౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఆశావహ దృక్పధంతో ప్రపంచంలోని పలు దేశాలను చుట్టేస్తున్నారు ఏపీ సీఎం. అమెరికా, లండన్, దుబాయ్,యూరప్, చైనా సింగపూర్, జపాన్, మలేసియా, ఇలా ఒకటేమిటి ప్రధాని మోడీ తరువాత అత్యధిక దేశాలు తిరిగిన ఘనత ఆయనదే. మోడీ దేశ ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు, రక్షణ పరమైన అంశాలకోసం దేశాలు పట్టి తిరిగితే, చంద్రబాబు పెట్టుబడులు, ఉపాధి అవకాశలకోసం పరితపిస్తూ తిరుగుతున్నారు. తాజాగా ఏపీ సీఎం దక్షిణ కొరియా పర్యటనలో బిజీ గా వున్నారు.

రండి రండి ఏపీకి .....

ఆ పర్యటనలో పారిశ్రామికవేత్తలను ఆ దేశ నేతలను కలుస్తున్న చంద్రబాబు అమరావతికి రావాలని కోరడమే కాదు సౌత్ కొరియా రెండో రాజధానిగా మన ప్రాంతాన్ని చేసుకోవాలని అభ్యర్ధించారు. అభివృద్ధి లో ఏపీ రెండెంకల వృద్ధి రేటు నమోదు చేస్తుందని వారి పెట్టుబడులకు డోకా లేదంటూ భరోసా ఇచ్చారు. సౌత్ కొరియన్ సిటీగా అమరావతిని మార్చాలని మీ దేశమే అన్నిటా మాకు స్ఫూర్తి... దీప్తి అన్నారు. దక్షిణ కొరియాకు ఏపీ కి చాలా పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే అక్కడి వారు వ్యక్తం చేసిన సందేహాలనుబాబు ఓపికగా నివృత్తి చేశారు. వారితో భేటీ అనంతరం 5 వేలకోట్ల రూపాయలు సౌత్ కొరియానుంచి పెట్టుబడుల రూపంలో రానున్నాయని 7 వేలమంది కి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంతోషం వ్యక్తం చేశారు ఏపీ సీఎం. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు కార్యరూపం దాలుస్తాయో రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

Similar News