ఈ టీడీపీ నేత పార్టీకి దూరమయితే....?

Update: 2017-11-02 10:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఇప్పుడు పార్టీ నుంచి వైదొలగనున్నారా? వచ్చే ఎన్నికలకు ముందే చంద్రబాబుకు ఝలక్ ఇవ్వనున్నారా? ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను అధిష్టానం పట్టించుకోవడం లేదన్నది ఆయన అనుచరవర్గం ఆరోపణ. విజయనగరం జిల్లా అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది పతివాడ నారాయణ స్వామి. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఆయన పార్టీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక దఫా మంత్రి పదవిని చేపట్టారు. అయితే ఆయనకు మంత్రి పదవి చేపట్టాలన్న ఆశతో చంద్రబాబు చుట్టూ ప్రదిక్షిణలు చేశారు. అయినా గత విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

పతివాడను దూరం చేసుకుంటే.....

టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిస్తానని చంద్రబాబు చెప్పినా... పతివాడ తిరస్కరించారు. ఆయనకు చివరకు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. అయితే ఈ పదవి కూడా ఆయనకు ఇష్టం లేదు. గతంలో ఈపదవిని పతివాడ చేశారు. దీంతో అయిష్టంగానే ఆయన పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో సీనియర్ అయిన తనకు ముఖ్యమైన పదవి ఇవ్వక పోవడం వల్ల పతివాడ కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. దీంతో నెలిమర్ల నియోజకవర్గంలోని పతివాడ అనుచరులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. తమకు ఇవ్వని గౌరవాన్ని తాము పార్టీకి ఎలా ఇస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఎంతకాలం సేవచేసినా ఇంతేనా? వేరే పార్టీలోకి వెళదాం.. అని పతివాడకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారట. కాని పతివాడ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. పార్టీపై అసంతృప్తితో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తన ముఖ్య అనుచరులతో చెప్పారట. మొత్తం మీద విజయనగరం జిల్లాలోని టీడీపీలో అసంతృప్తులు నెమ్మదినెమ్మదిగా బయటపడుతున్నాయి.

Similar News