ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ భయం పట్టుకుందా..? కొద్ది రోజులుగా నేతల హడావుడి చేస్తుంటే నిజమేనని అక్కడ పరిణామాలు చెపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో క్రమంగా పుంజుకోవడమే ఇందుకు కారణమని పలువురు అంటున్నారు. ఆ పార్టీ నేతలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.
ఇది కాంగ్రెస్ సీటేనా?
మానుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నోటిదురుసుతనం, అవినీతి ఆరోపణలు, కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించడం వంటి చర్యలతో అటు వ్యక్తిగతంగా పార్టీపరంగా నష్టం వాటిల్లిందని ఆయన అనుచరులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై కొద్దిపాటి తేడాతోనే గెలుపుపొందారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ టీఆర్ ఎస్‌లో టికెట్ రాకుంటే కాంగ్రెస్ నుంచైనా పోటీచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీఆర్ఎస్‌కు ఈసారి కష్టమేనని పలువురు అంటున్నారు. కాగా, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్ ఆశించేవారి సంఖ్య పెద్దగానే ఉంది.
దొంతిని ఎదుర్కొనడం అంత ఈజీకాదు....
డోర్నకల్ నియోజకవర్గంలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అయిన రెడ్యానాయక్‌ను ఎంపీగా పోటీ చేయించి, అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక్కడ కూడా రెడ్యాపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఆయన తప్పించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. నర్సంపేటలో టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి పల్లెనిద్ర పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. కానీ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఢీకొనడం అంతతేలికైన విషయం కాదని అంటున్నారు.
ములుగులో ఈసారి గట్టిపోటీ....
ములుగులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్ఎస్‌కు గట్టిపోటీ తప్పేటట్టులేదు. ఆమె ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక్కడ సీతక్కకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మానుకోట నుంచి పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ను కాదని ఎవరికీ ఇవ్వరని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌పై ప్రజల్లో ఉన్న ప్రతికూలత కాంగ్రెస్‌కు లాభం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భూపాలపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. తనయులు పనితీరుతో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి కష్టాలు తప్పడంలేదు. ఆయన ఇప్పటి నుంచి నియోజకవర్గంలో పల్లెనిద్ర పేరుతో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ స్పీకర్‌ను తప్పించి గండ్రసత్యనారాయణకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా జోరుగా తిరుగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి క్యాడర్‌ను బలోపేతం చేస్తున్నారు.
జనగాంలో నువ్వా? నేనా?
జనగామలోకూడా మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య జనంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఒక్కసారిగా వేలమందితో భారీ ర్యాలీ నిర్వహించడంతో కాంగ్రెస్ క్యాడర్ జోష్‌లో ఉంది. అప్పటి నుంచే అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా కొంచెం హడావుడి చేస్తున్నారు. మరోవైపు ముత్తిరెడ్డికి ఈసారి టికెట్ దక్కదనే ప్రచారం కూడా అదేస్థాయిలో ఉంది. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నిత్యం ప్రజలమధ్యే ఉంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేత జంగారాఘవరెడ్డి విస్తృతంగా పర్యటిస్తుండడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఎర్రబెల్లి సతీమణి కూడా నిత్యం గ్రమాల్లో పర్యటిస్తుండడం గమనార్హం.