రాజకీయాల్లో కొన్ని సార్లు జరిగే పరిణామాలు.. నేతలనే కాదు, పార్టీని సైతం ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి పరిస్థితే.. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నేతలు సీతక్క, పొదెం వీరయ్యలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ 2014లో తీవ్రంగా తలపడ్డారు. వీరిద్దరు ఓడిపోయి అక్కడ టీఆర్ఎస్ విన్ అయ్యింది. అప్పుడు ఇద్దరూ చెరో పార్టీలో ఉన్నారు కాబట్టి. సీతక్క టీడీపీ నుంచి వీరయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పట్లో హోరా హోరీ తలపడ్డారు. కానీ, పరిస్థితులు మారాయి. టీడీపీ తెలంగాణలో నామ రూపాలు లేకుండా పోయింది. దీంతో ఇటీవల పార్టీ మారిన రేవంత్ రెడ్డితో కలిసి సీతక్క.. కాంగ్రెస్‌లోకి జంప్ చేసేసింది. అయితే, ఈమె కూడా ములుగు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేత కావడంతో వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుంటే ఈ నియోజక వర్గం తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ కు ఇబ్బందే....
వచ్చే ఎన్నికల్లో ములుగు నుంచి తాను బరిలోకి దిగాలని సీతక్క, ఆల్రెడీ వీరయ్య ఎలాగూ ఉన్నాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ కండు వా కప్పుకున్న తర్వాత సీతక్క వీరయ్యను మర్యాద పూర్వకంగా కలిసినప్పటికీ.. ఆ తర్వాత నేతలిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. గత వైరాలను ఇద్దరూ మరిచిపోలేక పోతున్నారు. ఇక, 2019లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా వీరయ్య పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీతక్కను ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆహ్వానించినా.. సీతక్క మద్దతిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వీరయ్యలో అలజడి....
వాస్తవానికి సీతక్క రాకతో పొదెం వీరయ్య వర్గంలో అలజడి మొదలైంది. 1999, 2004ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన వీరయ్య 2009లో సీతక్క చేతిలో, 2014లో చందూలాల్ చేతిలో ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో గెలవకుంటే రిటైర్మెంట్ తప్పదని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిన్నటివరకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సీతక్క కాంగ్రెస్‌లోకి రావడంతో వీరయ్య అప్రమత్తమయ్యారు. సీతక్క ములుగు టిక్కెట్‌ను రిజర్వు చేసుకున్న తర్వాతనే కండువా కప్పుకున్నారనే వార్తలు రావడంతో ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, సీనియర్ నాయకులను కలిశారు. టిక్కెట్ కేటాయింపుపై తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
రిటైర్మెంట్ తప్పదా?
అయితే, సీతక్కకు కూడా బలమైన వ్యక్తే బ్యాక్‌లో ఉండి నడిపిస్తున్నాడు. ఆయనే రేవంత్. హైకమాండ్ దగ్గర ఇప్పుడిప్పుడే పలుకుబడి పెంచుకుంటున్న రేవంత్.. హామీ మేరకే సీతక్క కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని అంటున్నారు. దీనికితోడు వీరయ్య ప్రాబల్యం కూడా ములుగులో తగ్గిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీతక్క కాంగ్రెస్‌లోకి వచ్చిందని, ఆమెకే టికెట్ ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి వీరయ్య ఈ దెబ్బతో రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.