ఈ చాణుక్యుల్లో విజేత ఎవరు...?

Update: 2018-02-04 04:30 GMT

ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకునే వారు విజేతలుగా నిలుస్తున్నారు నేటి రాజకీయాల్లో. అలాంటి పాలిటిక్స్ పై నుంచే పైకి వచ్చిన వారు చంద్రబాబు, నరేంద్ర మోడీ. లక్ష్మీపార్వతి తో టిడిపి ఇక అంతరించిపోతుందన్న భయాన్ని సృష్టించి తన అనుకూల మీడియా తో ఎమ్యెల్యేలు తనవైపు అంతా వచ్చేశారన్న ప్రచారాన్ని సృష్టించి తన మామ ఎన్టీఆర్ లాంటి లెజెండ్ కే దెబ్బకొట్టి కుర్చీ ఎక్కేశారు చంద్రబాబు. అదే తీరులో గోద్రా అల్లర్లను తన విజయసోపానానికి అనుకూలంగా మార్చుకున్న చాణుక్యుడు నరేంద్ర మోడీ. కాపు ఉద్యమం లో చెలరేగిన హింసాకాండను తనకు అనుకూలంగా మార్చుకుని ఆ ఉద్యమాన్నే సాంతం తొక్కేయగలిగారు బాబు. మోడీ సైతం గత ఎన్నికల్లో తన పై వచ్చిన ప్రతి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకుని ప్రధాని పీఠం ఎక్కేసి తాను వందమంది చంద్రబాబు లతో సమానమని నిరూపించారు.

మోడీకి సవాల్ విసిరితే....

తనకు ఇష్టం లేని వారికి తన ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ దేశంలో చాలా శాంపిల్స్ చూపించేశారు. తమిళనాడులో శశికళ, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, గుజరాత్ లో అహ్మద్ పటేల్, ఇటీవలే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వంటి వారికి చుక్కలు కనిపించేలా చేశారు మోడీ. అదే తనవారు అనుకుంటే వారిని ఎలా చూస్తారో అమిత్ షా ను చూస్తే చాలు. షా పై ఎన్ని అభియోగాలు ఆరోపణలు, విమర్శలు వున్నా, అమిత్ కుమారుడిపై అభియోగాలు ముప్పిరిగొన్నా తన ఛత్రం కింద ఉంటే మోడీ రక్ష ఎలా ఉంటుందో తన మిత్రులకు, రాజకీయ శత్రువులకు చాటి చెప్పారు నరేంద్రుడు.

అందుకే బాబు సంయమనం, వేచి చూసే ధోరణి ...

మోడీ తో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో కాకలు తీరిన వ్యక్తి బాబు. ఆయన సంయమనం, వేచి చూసే ధోరణి అందుకోసమే అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రస్తుతం బాబు కు ఇప్పుడు సంక్షోభ సమయం. బిజెపి తో పోరాడితే ఏమి జరుగుతుంది ? పైకి హడావిడి చేసి పొత్తు కొనసాగిస్తే పార్టీకి చేటు తప్పేలా లేదు..? వీటిలో ఏ వ్యూహం ప్రకారం వెళ్ళినా టిడిపి కి ఎదురు దెబ్బలు తగిలేలాగే ఉన్నాయి. మరి అపార చాణుక్యుడు ఈ సంక్షోభాన్ని బాబు అవకాశం గా మలుచుకుంటారా ? బిజెపి దెబ్బలకు కుదలై చతికిలపడతారా ? తేలాలిసి వుంది.

Similar News