తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేసీఆర్ గుంపులో గోవిందా అన్నట్లు కాకుండా ఫేస్ టు ఫేస్ వారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యలతో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తప్ప వేరేచోట మాట్లాడే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా, ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా కేసీఆర్ సేకరిస్తున్నారు. అయితే వారితో నేరుగా మాట్లాడేందుకు వీలు లేదు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇరవై రోజుల్లో రోజుకు నలుగురైదుగురు ఎమ్మెల్యేలలతో వన్ టూ వన్ మాట్లాడాలని గులాబీ బాస్ నిర్ణయించారు.
ఎమ్మెల్యేలతో ఫేస్ టుఫేస్......
ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పైన ఏకంగా జిల్లా కలెక్టర్ అవినీతి ఆరోపణలు చేశారు. మరో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ తో అసభ్యకరంగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నారు. ఇక నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై మార్కెటింగ్ యార్డు ఛైర్మన్ హనుమంతప్ప అవినీతి ఆరోపణలు చేశారు. తాను పదవి కోసం ఎమ్మెల్యేకు 13 లక్షలు ఇచ్చానని ప్రకటించారు. ఇక స్పీకర్ మధుసూదనాచారిపైన కూడా మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ఆరోపణలు చేశారు. నిజామాబాద్ రూరల్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వ్యక్తిగత విభేదాలతో రోడ్డెక్కారు. ఇక రసమయి బాలకిషన్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఇంటలిజెన్స్ ద్వారా తెప్పించుకున్న వివరాలను కూడా ఎమ్మెల్యేల ముందు ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలపై కూడా వీరిలో కొందరికి అవగాహన లేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో కేసీఆర్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది.