ఈ ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందా?

Update: 2017-11-25 16:30 GMT

ఈ ఉప ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. జయలలిత వారసులెవరో తేల్చనుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా పళనిస్వామి, శశికళ వర్గాలకు ఇది సవాల్ గా మారింది. దినకరన్ తిరిగి టోపీ గుర్తుపై పోటీ చేస్తానని ప్రకటించారు. టోపీ గుర్తుపైనే తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శశికళ కూడా దినకరన్ పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని నమ్ముతున్నారు. డిసెంబరు 21వ తేదీన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుంది. పళనిస్వామికి కూడా ఈ ఎన్నికలో గెలుపు అనివార్యమవుతుంది. జయ వారసులెవరో తేల్చేందుకు ఈ ఎన్నిక ఫలితం ఉపయోగపడుతుంది. పన్నీర్ సెల్వం శశికళతో విభేదించి తొలుత బయటకు వచ్చారు. తన దారి తాను చూసుకున్నారు. కాని పళనిస్వామిది అలా కాదు. శశికళే దగ్గరుండి పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చిన్నమ్మను చివరకు నట్టేట ముంచారన్నది పళనిస్వామిపై ఉన్న ఆరోపణ.

సెంటిమెంట్ ఎవరివైపు.....

వరసగా జరుగుతున్న ఐటీదాడులు, పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని బహిష్కరించడం వంటి వాటికి పళనిస్వామి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. శశికళకు తీవ్ర ద్రోహం చేశారన్నది పళనిస్వామిపై తమిళనాడులో అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కమలనాధులు చెప్పినట్లే తమిళనాట ప్రభుత్వం నడుస్తుందని, ఇది అమ్మ ఆశయాలకే వ్యతిరేకమన్నది అధికశాతం మంది తమిళుల అభిప్రాయం. రెండాకుల గుర్తు దక్కడం పళనిస్వామి వర్గానికి కొంత ఊరట లభించినా బీజేపీతో అంటకాగడం పళనిస్వామికి మైనస్ పాయింట్ అని చెప్పక తప్పదు. మరోవైపు పళనిస్వామి జయలలిత మరణంపై విచారణ కమిషన్ వేశారు. జయలలిత మృతికి శశికళే కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పళనిస్వామి తరుపున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోయినా మధుసూదనన్ కే ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తున్నారు. అయితే ప్రధాన పోటీ దినకరన్, పళనిస్వామి వర్గాల మధ్యనే ఉంటుంది. మరోవైపు డీఎంకే కూడా అభ్యర్థిని ప్రకటించింది. రెండు వర్గాల ఓట్లు చీల్చుకుంటే తమదే విజయమని డీఎంకే భావిస్తుంది. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేష్ పోటీలో ఉంటారని స్టాలిన్ ప్రకటించారు. మొత్తం ఆర్కే నగర్ ఉప ఎన్నిక అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది.

Similar News