ఇవి జగన్ కు కలిసి వస్తాయా...?

Update: 2018-02-05 01:30 GMT

జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ పాదయాత్రకు పెద్దయెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. జగన్ ఇప్పటికే మూడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని నాలుగో జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే పాదయాత్రలో ఒక వ్యూహం ప్రకారం సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తున్నారు. బహిరంగ సభలతో పాటు ప్రత్యేకంగా కుల పెద్దలు, సామాజిక వర్గాల వారితో జరుపుతున్న సమావేశాలు కొంత ఫలితాలనిస్తున్నాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న సామాజిక వర్గం నేతలను జగన్ మీట్ అవుతున్నారు.

కులాల వారీగా మీట్ లు....

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీలు, రైతులు, చేనేతలు ఇలా అన్ని వర్గాలు, మతాల వారితో విడిగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి సమస్యలను భవిష్యత్తులో విడుదల చేయబోయే మ్యానిఫేస్టోలో పెడతామని అదే వేదికపై హామీలు ఇస్తూ వస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో అక్కడ తెలుగుదేశం, వైసీపీ అన్ని కులాలతో సమావేశమై వారిపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాను పర్యటించే నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కులం, సామాజిక వర్గాలతో జగన్ సమావేశమై పలు హామీలను గుప్పిస్తున్నారు.

బలమైన ఓటు బ్యాంకు ఉన్న చోట.....

నెల్లూరు రూరల్ జిల్లాలో పర్యటిస్తున్న జగన్ దేవరపాలెంలో ఆర్యవైశ్యులతో ఆత్మీయసమ్మేళనాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని ఆర్యవైశ్యులలో ప్రముఖులతో పాటు అందరూ హాజరైన ఈ సమావేశంలో జగన్ పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జీఎస్టీ వచ్చిన తర్వాత తమపై దాడులు పెరిగాయని ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆర్యవైశ్యులను అవమానిస్తే దేశం ముందడగు వేయదని జగన్ అభిప్రాయపడ్డారు. పేదరికానికి కులం, మతం అనేది ఉండదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే నవంబరు 1వ తేదీన పొట్టి శ్రీరాములును గుర్తుచేసుకుంటూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పడం విశేషం. ఇలా వివిధ కులాలు, సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు తమకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Similar News