అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరుకానుంది. అయితే ఇవాంకా పర్యటనకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇవాంకా రాకతో ఇండియాలో పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇవాంకా భద్రతపై అమెరికా ఫెడరల్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇవాంకా పర్యటించే అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఇవాంకా పర్యటించే ప్రదేశంలో ఎవరూ చొరబడకుండా ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు. ఆమె బస చేసే హోటల్ దగ్గర నుంచి సమావేశం జరిగే హెచ్ఐసీసీ వరకూ వందల సంఖ్యలో పోలీసులు కాపలా కాస్తున్నారు. మరో నాలుగు రోజుల్లోనే ఇవాంకా హైదరాబాద్ కు చేరుకోనున్న నేపథ్యంలో ఇవాంకాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఐదు కోట్లు వెచ్చించి....
ఇందులో భాగంగా ఇవాంకా పర్యటించే ప్రాంతంలో ప్రమాదకరమైన బాక్టీరియా, వైరస్, విష రసాయానాలతో ఎవరైనా దాడులు చేస్తే ఏంటి సంగతి? అందుకోసం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేక వాహనాన్ని తెప్పించారు. దానిపేరే హజ్మత్. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి వాహనాన్ని ఉపయోగించలేదట. ఇవాంకా భద్రత వాహనాల్లో ఇది చేరిపోయింది. జీఈఎస్ విధానంలో నడిచే ఈ హజ్మత్ వాహనం పేలుడు పదార్థాలు, విషరసాయనాలు, ఆయుధాలు, ప్రమాదకరమైన బాక్టీరియా, వైరస్ వంటి వాటిని ఇట్టే పసిగడుతుంది. ఇందులో ప్రత్యేక నిపుణులు కూడా ఉంటారు. అయితే ఈ వాహనం ఖరీదు ఐదు కోట్లు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలోనే ఈ వాహనం ఉంటుంది. అయితే ఈ వాహనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అగ్నిమాపక శాఖ ఐదు కోట్లను వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇప్పటి వరకూ దీనిని ఉపయోగించలేదు. తొలిసారిగా ఇవాంకా పర్యటన కోసం దీన్ని బయటకు తీస్తున్నారు. ఈ వాహనంలో మొత్తం 32 మంది రెండు షిప్ట్ లలో పనిచేస్తారు. మొత్తం మీద ఇవాంకా ట్రంప్ రాకతో ఈ వాహనానికి పని పడిందంటున్నారు. 2009లో కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని తొలిసారి ఇవాంకా పర్యటనకు వినియోగిస్తుండటం విశేషం.