ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు కోసం సిద్ధిపేట నేతన్నలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వారి ఎదురు చూపులకు కారణం కనుమరుగైపోతున్న తమ చేనేత వస్త్రాలకు తిరిగి జీవం పోసుకునే తరుణం వస్తుందన్న చిన్న ఆశ. ఇంతకీ సిద్ధిపేట నేతన్నలు ఏమి చేశారు అంటే గొల్లభామ చీరలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా 1940 లలో తమ అద్భుత కళానైపుణ్యంతో సిద్ధిపేట నేతన్నలు గొల్లభామ చీరను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చీర మగువల మనసు దోచి పడేసేదిగా ఉండేది. రాను రాను కాలక్రమంలో చేనేతకు ఆదరణ కనుమరుగు అవుతున్న నేపథ్యంలో సుప్రసిద్ధ గొల్లభామ చీరలు నేసేవారు కనుమరుగు అయిపోయారు.
ఏమిటి చీర స్పెషల్ ....
నెత్తి మీద కుండ పెట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళే పల్లె పడుచు బొమ్మతో ప్రత్యేక మగ్గం పై నేతన్నలు ఈ చీరలు రూపొందిస్తారు. ఈ చీరలకు కాటన్ మస్టర్స్ మిక్స్ చేస్తారు. తయారు చేసే వారు కూడా ఎంతో నైపుణ్యం కలిగిన వారై వుంటారు. ఈ చీరల డిమాండ్ అధికంగా వున్నప్పుడు చేనేతకు ఆదరణ బాగున్నప్పుడు సిద్ధిపేటలో సుమారు 400 లమంది నేతన్నలు గొల్ల భామ చీరల మేకింగ్ లో ఉంటే ఇప్పుడు ఆ చీరలు నేయగల సమర్థులు 16 మంది మాత్రమే వున్నారు.
సమంత కృషితో వెలుగు చూసిన గొల్లభామ ...
దాదాపు అందరు మర్చిపోయారు అనుకున్న గొల్లభామ కళాత్మక చీరలను వెలుగులోకి తెచ్చింది హీరోయిన్ సమంత అని ఆనందంగా చెబుతున్నారు కరీంనగర్ నేతన్నలు. చేనేతకు తెలంగాణ లో బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన సమంత వీటిని తెలుసుకుని ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రదర్శన ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావును అభ్యర్ధించారు. దాంతో ఆయన అంగీకరించారు. ఇటీవల కరీంనగర్ కి చెందిన విద్యార్థుల బృందం సైతం గొల్లభామ చీరల పై ప్రభుత్వానికి తాము జరిపిన అధ్యయనాన్ని నివేదిక రూపంలో అందజేసింది ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ చీరల ప్రదర్శన ఏర్పాటై అమెరికా అధ్యక్షురాలి కుమార్తె ట్రంప్ వంటి వారిని ఆకట్టుకుంటే తిరిగి నేతన్నలకు పూర్వవైభవం దక్కుతుంది. అలా జరగాలని ఆశిద్దాం