ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది అన్నది సామెత. చాలా సందర్భాల్లో అవినీతి విషయంలో ఈ సామెత అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. దేశమంతా ఇప్పుడు లంచం లంచం లంచం. ఓటు వేయడానికి ఓటరుకి లంచం. ఉద్యోగం సంపాదించాలంటే లంచం. ఏ కార్యాలయంలో పని చేయించుకోవాలన్నా లంచం. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళితే లంచం. న్యాయం చేయాలని కోర్టు కి వెళితే లంచం. ఇలా ప్రతి చోట అందుగలదు ఇందు లేదనే విధంగా అవినీతి చీడ లేని వ్యవస్థ లేకుండా మన రాజకీయ నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు ఈ అవినీతి విద్యార్థులకు పాకింది. అదే ఇప్పుడు అందరిని ఆందోళనకు గురిచేస్తుంది.
ఉత్తరప్రదేశ్ లో విద్యార్థులు ఇలా ...
పదవతరగతి ప్రతి విద్యార్థి జీవితంలో పై మెట్టుకు పరమపదసోపానం. అలాంటి పరీక్షల్లో పాస్ అయితేనే వారికి భవిష్యత్తు. మరి ఈ పరీక్షల్లో ఉత్తిర్ణులు కావాలంటే బాగా కష్టపడి అయినా చదవాలి లేక స్లిప్ లు పెట్టో పక్కనోడి పేపర్లో మాస్ కాపియింగో చేయడం ఇప్పటివరకు నడుస్తున్న సిస్టం. అసలు ఇవన్నీ కాదు మనం సినిమా స్టోరీ రాసినా మంచి మార్కులు తో పాస్ కావాలంటే ఏమి చేయాలనీ విద్యార్థులు ఐడియా వేశారు. అనుకున్నదే తడవు వారికి ఒక ఆలోచన వచ్చేసింది. నేరుగా తమ పేపర్లు దిద్దే వారినే కొనేస్తే పోలా అని భావించారు. తాము పరీక్షల్లో రాసిచ్చిన ఆన్సర్ షీట్లలో నేరుగా డబ్బు జమ వేసేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఉపాధ్యాయులనే కాదు సభ్య సమాజంలోనే సంచలనం, చర్చనీయాంశం అయ్యింది. వంద రూపాయలు ఐదువందల నోట్లు కరెన్సీ ఆన్సర్ షీట్లలో పిన్ పెట్టి మరీ మార్కుల వేసేవారికి మా పని మేం చేసాం ఇక మీ పని మీరు చూసి మార్కులేసి మమ్మల్ని పాస్ చేయించండి అంటూ వారిని ప్రార్ధించడం చూస్తే ముక్కున వేలేసుకోక మానరు.