కేవీపీ రామచంద్రరావు. దివంగత వైఎస్ ఆత్మగా మీడియా పెట్టిన పేరుతో సుపరిచితుడైన కేవీపీ.. ఏపీ అభివృద్ధి కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఏపీ గురించి అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపైనా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై ఇప్పటికిప్పుడు కేవీపీ ఒక్కరే రాజ్యసభలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజకీయ నేతలే ఆయనను హీరో అంటూ కొనియాడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్యాకేజీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఆ తర్వాత లభించాల్సిన బెనిఫిట్స్‌ను వేటినీ కూడా ఇవ్వకుండా కాలం గడుపుతోంది. ఈ పరిణామం ఏపీ ప్రజలను నిలువెల్లా బాధిస్తోంది.
గళం విప్పే నేతగా....
దీంతో ఏపీ నుంచి గళం వినిపించే వారు కావాలని, కేంద్రంపై గట్టిగా పోరాటం చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి తాను కేంద్రంతో ముడిపెట్టుకుని జట్టుకడితే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు బీజేపీ ప్రభుత్వంతో సుతి మెత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఒక్కరూపాయి కూడా విడుదల చేయకుండా ఏపీని గట్టిగానే మొట్టుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ గురించి గట్టిగా నిలదీయాలని ప్రజలే స్వయంగా కోరుతున్నారు. అయినా కూడా చంద్రబాబు ఆ దిశగా ఇప్పటికీ అడుగులు వేయడం లేదు. ఇంకా పూర్తిగా మునిగిపోయాక చూద్దాం.. చేద్దాం.. అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు కానీ, వైసీపీకి చెందిన ఎంపీలు కానీ.. ఈ విషయంలో ఇప్పటికీ మౌనంగా ఉండడం మరో విశేషం.
రోజంతా నిలబడి.....
అయితే, గత కొన్నాళ్లుగా ఏపీ సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పుతున్న కేవీపీ.. తాజాగా బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపైనా ఆయన నోరు విప్పారు. రాజ్యసభలో రోజు రోజంతా ఆయన నిలువుకాళ్లపై చైర్మన్ పోడియం వద్ద నిలబడి ''సేవ్ ఆంధ్రప్రదేశ్' బోర్డు పట్టుకుని మౌన దీక్షకు దిగారు. దీంతో సభకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ చైర్మన్ కురియన్.. ఏకంగా కేవీపీని ''పిచ్చోడివా ఏంటి?.. పొద్దున్నించి నిలబడే ఉన్నావ్'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వెనక్కు తగ్గని కేవీపీ....
అయినా కూడా కేవీపీ వెనక్కి తగ్గింది లేదు. అంతేకాదు, ఏపీకి లాభం చేకూరుతుందంటే.. తాను పిచ్చోడినని అనిపించుకునేందుకు కూడా సిద్ధమేనని ఆయన కురియన్‌కు లేఖరాశారు. ఈ పరిణామం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడే మరో విషయం గమనార్హం. ప్రస్తుతం కేవీపీ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందలేదు. ఆయన తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి రాజ్యసభకు వెళ్లారు. మరి మన ఎంపీలు మాత్రం తినిపడుకుంటున్నారు. దీనిని బట్టి కేవీపీనే హీరో అనడంలో సందేహం ఎందుకు..? ఇక ఏపీ నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్టీల విషయాన్ని, పార్టీల జెండా, అజెండాలను పక్కన పెట్టేసి కలిసికట్టుగా ఫైట్ చేస్తే కేంద్రం దిగి వచ్చే అవకాశముంది.