ఇద్దరు మాజీ మంత్రుల వికెట్లు ప‌డుతున్నాయా!

Update: 2017-12-23 13:30 GMT

ఫైర్ బ్రాండ్‌ రేవంత్ రెడ్డి రాక‌తో ఫుల్ జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు త్వ‌ర‌లోనే గ‌ట్టి ఎదురుదెబ్బ‌ త‌గ‌ల‌బోతోంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. సొంత పార్టీ నాయ‌కులే దిమ్మ‌తిరిగే షాక్‌ ఇవ్వ‌బోతున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. స‌మ‌ష్టిగా రాణించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని అధిష్టానం ఆదేశాలు జారీచేస్తున్నా.. పార్టీలోని సీనియ‌ర్లు ఇప్పుడు ప‌క్క‌చూపులు చూస్తున్నా రు. త్వ‌ర‌లో ఇద్ద‌రు మాజీ మంత్రులతో పాటు కొంత‌మంది నాయ‌కులు షేక్ హ్యాండ్ ఇచ్చి.. కారెక్కేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తొలి ద‌శ చ‌ర్చ‌లు కూడా ముగిశాయి.

టీఆర్ఎస్ నేతలతో టచ్ లో...

తెలంగాణ ఇచ్చినా దానిని స‌ద్వినియోగం చేసుకోకుండా అధికారిన్ని కోల్పోయామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా గెలిచి అధిష్టానానికి కానుక ఇవ్వాల‌నుకుంటున్నారు టీకాంగ్రెస్ నేత‌లు! ఇదే ల‌క్ష్యంతో ప్రణాళిక‌తో ముందుకు వెళుతున్నా రు. పార్టీలోని పెద్ద‌లంతా ఇలా ఉంటే.. మ‌రికొంత మంది సీనియ‌ర్ల‌తో పాటు ద్వితీయ శ్రేణి నాయ‌కుల ఆలోచ‌న‌లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయ‌ట‌. అంతేగాక చాప‌కింద నీరులా త‌మ పని తాము చేసుకుపోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరంతా టీఆర్ఎస్ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారట‌. వీరంతా త్వ‌ర‌లోనే కారు ఎక్కేసేందుకు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నార‌ట‌.

సీటు దొరికితే కారెక్కేందుకు...

కాంగ్రెస్‌ పార్టీకి బలమైన జిల్లాలుగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌తోపాటు నల్లగొండ జిల్లాకు పేరుంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్‌ నేతలను అధికార పార్టీ టార్గెట్‌ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలతో అధికారపార్టీలోని కీలక నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అధికారపార్టీలో జరుగుతున్న చర్చల ప్రకారం రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రతాప్‌రెడ్డితో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్ కూడా గులాబీపార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారం. మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కారెక్కేందుకు సిద్ధమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ద్వితీయ శ్రేణి నేతలను కూడా...

జిల్లాల్లోని సెకండరీ నాయకత్వాన్ని టీఆర్‌ఎస్‌ టార్గెట్ చేసింద‌నే చ‌ర్చ మొద‌లైంది. వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకావం కల్పిస్తామని పార్టీల్లో చేర్చుకుంటున్న నేతలకు హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఇతర పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ జోరుమీదున్న కాంగ్రెస్‌కు.. టీఆర్‌ఎస్ ఊహించని షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి టీఆర్ఎస్‌కు ధీటుగా ఎద‌గాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఒక‌డుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న చందంగా మారతాయో లేక స‌త్ఫ‌లితాలు ఇస్తాయో వేచిచూడాల్సిందే!!

Similar News