పోలవరం ప్రాజెక్ట్ పై ఏర్పడ్డ ప్రతిష్టంభన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అప్రదిష్టపాలుకావడంతో ఆ విమర్శలనుంచి బయటపడే పని వారు మొదలు పెట్టారు. కేంద్రం ఐదు నెలల క్రితం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటి ఇప్పటివరకు ఎలాంటి పని పాట లేకుండా వుంది. ఆ కమిటి కి ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎదురౌతున్న సమస్యలు గుర్తించడం, సాంకేతిక, ఆర్ధిక సమస్యలు, పెరిగిన అంచనాలు లెక్కలు కట్టడం త్రిసభ్య కమిటి విధి విధానం. కాఫర్ డ్యామ్ ఆపాలని, కొత్తవారికి పనులు అప్పగించాలని టెండర్ల ప్రక్రియ కు కేంద్రం బ్రేక్ లు వేసిన తరువాత ఏపీ సర్కార్ తో కేంద్రమంత్రి గడ్కరీ సమావేశమై స్వయంగా పనుల పర్యవేక్షణకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తానని ప్రకటించారు. ఈనెల 22 న పోలవరం సందర్శనకు గడ్కరీ వస్తుండటంతో ఈలోపు అక్కడి పరిస్థితులను నివేదిక రూపంలో సిద్ధం చేయడానికి త్రిసభ్య కమిటి రంగంలోకి దిగింది.
అమరావతిలో తొలిసమావేశం ...
ముందుగా అమరావతిలో సమావేశం అయిన కమిటి తరువాత ప్రాజెక్ట్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయనుంది. ఆ నివేదికను కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ కి అందజేస్తుంది. ఇదిలా ఉండగా భారీ యంత్రాల తరలింపు, కూలీల తరలింపుల కోసం అదనంగా చెల్లించాలని ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ అభ్యర్ధించింది. కాంట్రాక్ట్ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ ముందు పెట్టింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీ 22 న పోలవరం వస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రాజెక్ట్ దగ్గర తాజా పరిస్థితులపై సమీక్ష జరపనున్నారు. గత పక్షం రోజులుగా పోలవరం పై సాగుతున్న వివాదాలు, విమర్శలు ఆరోపణలు రోజు రోజుకు అన్ని వర్గాలనుంచి పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడంతో బాటు ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. పనుల వేగం ఎలా ఉన్నప్పటికీ ఇరువురు రోడ్డున పడకుండా సాగాలని ఢిల్లీ సమావేశంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
కొత్త టెండర్లు వుంటాయో ఉండవో తేలిపోనుంది ...
పనుల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొత్త టెండర్లు పిలిచి వేగవంతం చేస్తామని పోలవరం ప్రాధికార సంస్థ అనుమతి లేకుండా ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఈ అంశం కూడా తేలనుంది. పాత కాంట్రాక్టర్ కి సరైన మద్దతు ఇచ్చే పని వేగవంతం చేయాలని కొత్త టెండర్లు పిలిచి కొత్తవారిని నియమిస్తే 35 శాతం అధిక వ్యయం అవుతుందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి నో చెప్పింది. దీనిపై గడ్కరీ పోలవరం పర్యటనకు వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం వుంది.