ఇద్దరూ మోడీకి ఇంకా సలామ్ ...?

Update: 2018-03-13 12:30 GMT

రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమిలేదన్న వాదన నాలుగేళ్ళ తరువాత టిడిపి బయట పెట్టి రాజకీయ లబ్దికి బిజెపి, వైసిపి పై యుద్ధం మొదలు పెట్టింది. కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులచేత రాజీనామా చేయించి ప్రభుత్వంలోనుంచి దాదాపుగా బయటకు వచ్చేసింది టిడిపి. కానీ ఒక వ్యూహం ప్రకారం మోడీ తో మిత్రత్వం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి స్థాయిలో తెగతెంపులు కోసం భవిష్యత్తులో నిర్ణయిస్తామంటూ ఇంకా పొత్తు కొనసాగిస్తూనే గందరగోళ రాజకీయాలకు తెరలేపింది. అసెంబ్లీ వేదికగా బిజెపి పై చంద్రబాబు గర్జిస్తునే ఉన్నారు. నిత్యం అసెంబ్లీ వేదికగా మిత్రపక్షంపై విరుచుకుపడుతున్నారు బాబు. బాబు పూర్తి స్థాయిలో బిజెపి నుంచి విడిపడటానికి వెనుకంజ వేయడానికి ప్రధాని మోడీ టీం కక్ష సాధింపునకు దిగుతుందనే భయం వెంటాడమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే అటు పార్లమెంట్ లోను ఇటు రాష్ట్రంలోను వైసిపి టార్గెట్ గా టిడిపి ని కడిగేస్తుంది. ఇదంతా డ్రామానే అని కొందరు కొట్టిపారేస్తున్నారు కూడా.

జగన్ పార్టీ ది అదే రూట్ ...

వైసిపి సైతం టిడిపి బాటలోనే నడుస్తున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్రంపై తక్కువ స్థాయిలో టిడిపి పై తుఫాన్ లా విమర్శిస్తోంది వైసిపి. ఆ పార్టీ ధోరణిపై నిత్యం రాష్ట్రంలో చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మోడీ పై నమ్మకం ఉందని ప్రత్యేక హోదా ఆయన ఇవ్వగలరని చెప్పడం సంచలనం గా మారింది. విశ్వాసం వున్నప్పుడు కేంద్రంపై అవిశ్వాసం దేనికంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ విమర్శల దాడి సైతం డోస్ పెంచారు. వైసిపి అధినేత జగన్ మాత్రం ఏ పార్టీ హోదా ఇస్తామన్నా వారికే జై అని ప్రకటించడంతో వైసిపి వర్గాల్లో ఈ అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కేసుల్లో వున్న జగన్ కేంద్రంతో రాజీ కోసమే ఇదంతా అన్న అంశం గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పనిలో పడ్డారు తమ్ముళ్ళు.

బాబు అలా సుజనా ఇలా ...

రూపాయి సాయం కేంద్రం చేయడం లేదంటూ బాబు వ్యాఖ్యానించారు కూడా. ఆయన ఇలా మాట్లాడితే సుజనా చౌదరి విభిన్నంగా స్పందించారు. ఆయన కొన్ని ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేంద్రం చాలా వరకు సాయం అందించింది అని చెప్పుకొచ్చారు. హోదా, రైల్వే జోన్ వంటి వాటిపై కూడా కేంద్రం సీరియస్ గా పరిశీలన జరిపిందని అన్నారు. అయితే తాను చేసిన సాయంపై అసంతృప్తి ఉందని వెల్లడించారు. సుజనా చేసిన వ్యాఖ్యలు కూడా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు లాగే సంచలనంగా మారాయి. రెండు పార్టీలు ఇలా పోటీలు పడి జిందాబాద్ లు కొట్టడం విచిత్ర రాజకీయాలకు వేదికగా మారింది. మొత్తానికి రెండు పార్టీలు మోడీ సర్కార్ కె అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రజల్లో వున్న వేడిని తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే బాబు వ్యతిరేకంగా సుజనా కేంద్రానికి అనుకూల ధోరణే అనుసరించడం తో టిడిపి కార్యకర్తల్లో అయోమయం నెలకొంది

Similar News