ఇద్దరూ ఒకే సమయంలో పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు. సినిమాల్లో ఇద్దరూ మంచి స్నేహితులే. ఇద్దరి గురువూ ఒక్కరే. బాలచందర్. ఇద్దరూ సినిమాల్లో వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. అదే అభిమానంతో ఇప్పడు తమిళనాట రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ వయస్సు అడ్డంకిగా మారనుంది. రజనీకాంత్ ఇప్పటికే 67 ఏళ్ల వయస్సు ఉంది. కమల్ హాసన్ కు 63 ఏళ్లు. ఈ వయస్సులో ఇప్పడు పార్టీ పెట్టి ఏం సాధిస్తారని తమిళనాట ప్రచారం అప్పుడే ఊపందుకుంది. సినిమాలతో వచ్చిన ఇమేజ్ తోనే వీరు రాజీకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, అయితే అది కొంతవరకే విజయానికి దోహదపడుతుందన్నది ఒక తమిళపత్రిక ప్రత్యేక కథనం రాసింది.
రజనీపై లోకల్ వివాదం....
ఇక రజనీపై లోకల్ వివాదాన్ని కూడా అప్పుడే ప్రారంభించారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో లోకల్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. రజనీకాంత్ మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో సెటిల్ అయ్యారని, తమిళనాడు లో హీరోగా అవతారమెత్తారని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమిళేతరుడికి ఇక్కడ స్థానం లేదని అప్పుడే తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. రాజనీరాకను వ్యతిరేకిస్తూ కొన్ని సంస్థలు అప్పుడే ఆందోళనను కూడా ప్రారంభించాయి. అయితే తాను ఎప్పటికీ తమిళుడినేని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.
కమల్ కు హిందుత్వ వాదులు....
ఇక కమల్ హాసన్ కు కూడా హిందూ సంస్థల నుంచి ఇటీవల వ్యతిరేకత ఎదురైంది. హిందూమతం గురించి కమల్ రాసిన వ్యాసం తమిళనాట దుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హిందూకుటుంబంలో పుట్టినా ఆయన తమ మనోభావాలను దెబ్బతీశారని హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. తర్వాత కమల్ కొంత దీనిపై కొంత వివరణ ఇచ్చుకో్వాల్సి వచ్చింది. అయితే ఇద్దరినీ రాజకీయంగా అడ్డుకునేందుకు ప్రధానంగా అధికార, ప్రతిపక్ష అన్నాడీఎంకే, డీఎంకేలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. కరుణ ఆశీస్సులను పొందేందుకే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ ఇటీవల తన పార్టీ చిహ్నాన్ని పరిచయం చేశారు. అందులో తామరపువ్వు, ముద్రతో కూడిన చేయి గుర్తు ఉంది. అయితే తామరపువ్వు పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీకి చెందిన కమలం గుర్తులా ఉందని దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని సన్నిహితులు చెప్పడంతో తామరపువ్వును చిహ్నం నుంచి తీసేయాలని రజనీ ఆదేశించారు. చిహ్నంలో మార్పు చేయాలని సూచించారు.