బీఎస్పీ అధినేత్రి మాయావతి తన తప్పులు దిద్దుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికల పడిన పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి మాయావతి ఏకపక్ష నిర్ణయాలతో పాటు, పార్టీ సీనియర్ నేతల ప్రమేయం కూడా ఉందని గుర్తించారు. దీంతో మాయావతి నష్ట నివారణ చర్యలకు దిగారు. ప్రస్తుతం మాయావతి పార్టీ నుంచి వందల సంఖ్యలో నేతలు ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు పూనుకున్నారు.
ద్వితీయ శ్రేణి నేతలకు......
బీఎస్పీ నుంచి గత రెండేళ్లలో దాదాపు 150 మంది నేతలు ఇతర పార్టీలకు వలస పోయారు. దీంతో పార్టీలో నేతలు కరువయ్యారు. ఈ నేపథ్యంలో మాయవతి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ద్వితీయ శ్రేణినేతల్లో పదునున్న వారిని గుర్తించి వారికి పెద్దపీట వేయనున్నారు. వారికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తిరిగి కోలుకునేందుకు వరుసగా పార్టీ సెకండ్ క్యాడర్ తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి నమ్మకంగా పనిచేసే వారిని గుర్తించి వారిని పార్టీలో ముఖ్యమైన భూమిక పోషించే విధంగా క్యాడర్ ను తయారు చేస్తున్నారు. మొత్తం మీద మాయావతి కొత్త వ్యూహం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.