ఇదేగా ప్రేమంటే మ‌రి!

Update: 2017-12-26 10:30 GMT

ఎవరు ఎవ‌రిపైనా ప్రేమ కురిపించ‌వ‌చ్చు.. కొన్నిసార్లు అది హ‌ద్దు దాటితే ప్రమాద‌మే.. రాజ‌కీయాల్లో ప్రేమ వేరు.. అది అవ‌స‌రార్థం ప్రేమ.. అధికారం కోసం అర్రులు చాచే ప్రేమ‌.. ఇలాంటి ప్రేమ అన్ని వేళ‌లా ఫ‌లించ‌వచ్చు ఫ‌లించ‌క‌పోవ‌చ్చు.. తాజాగా త‌మిళ‌నాట ఆర్కేన‌గ‌ర్ ఫ‌లితంతో అమ్మ గెలిచింది.. చిన్నమ్మ గెలిచింది అంటూ అక్కడి దిన‌క‌ర‌న్ గ్యాంగ్ సంబ‌ర‌ప‌డిపోతోంది. ఇలాంటి సానుభూతి రాజ‌కీయాల ఎల్లకాలం రాణించ‌వేమో!చ‌రిత్రలో కూడా ఇదే నిరూపితం. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ మ‌హ‌త్మా గాంధీ ని బీజేపీని ప‌టేల్ ని త‌మ ఐకాన్లుగా చూపించ‌వ‌చ్చు. అది కూడా ఓ అవ‌స‌రార్థమే. ఇదే కాద‌న‌లేని నిజం.

ఫ‌లిస్తుందా.....?

ఆత్మగౌర‌వ నినాదం ఎత్తుకున్న ఎన్టీఆర్ ఇవాళ చాలా మందికి కావాలి అటు టీడీపీకి ఇటు వైఎస్సార్‌సీపీకి ఇంకా ఇంకెంద‌రికో... ఎన్టీఆర్ మావోడే అనిపించుకోవాల‌న్న తాప‌త్రయం ఆఖ‌రికి బీజేపీ లోనూ కనిపించ‌వ‌చ్చు. ఎందుకంటే ఆయ‌న గారాల‌ప‌ట్టి పురంధ‌రి అక్కడే ఉన్నారు గ‌నుక‌. అలానే ఎన్నో అడ్డంగులు దాటి పార్లమెంట్ వేదిక‌గా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కూ ఆయ‌న అవ‌స‌రం రావ‌చ్చు. ఎందుకంటే అదంతా ఓటు బ్యాంకు గ‌నుక‌. ఇక నెహ్రూనో గాంధీనో కాంగ్రెస్ స్మరించ‌వ‌చ్చు దీనిని ఎవ్వరూ కాద‌నరు కానీ దాని వెనుక ఉన్నవ‌న్నీ ప్రయోజ‌నాలే త‌ప్ప ప్రజ‌ల‌కు మేలు చేద్దామ‌న్న త‌లంపు ఒకింత కూడా ఉండ‌దు గాక ఉండ‌దు. ఉంటే గింటే మ‌హా అయితే వారి పేరిట సంక్షేమ ప‌థ‌కాలకు పేర్లు పెడ‌తారు అంత‌కుమించి వీరు కానీ వారు కానీ చేసేదేమీ ఉండదు. నిజంగా ఈ దేశానికి ఓ మ‌హాత్ముడు కావాల‌ని ప‌రిత‌పించే నేత‌లెవ్వరూ ఇలా గ‌త కాల విజ‌యాల‌కు ప్రతినిధులుగా నిలిచిన వారి స్మర‌ణ ఎల్లకాలం చేయ‌రు. మ‌రో చ‌రిత్ర నిర్మాణానికి పూనిక వ‌హించే వారెవ్వరికీ ఏళ్లకు ఏళ్లు నిన్నటి వ్యక్తుల స్మర‌ణ చేయ‌రు గాక చేయ‌రు. జ‌యంతులు వ‌ర్థంతులు అన్నవి కేవ‌లం రాజ‌కీయ అవ‌స‌రాలే కానీ నిజంగా వారి ఆశ‌య సాధ‌న‌కు వీరు చేస్తున్న కృషి ఎంత‌న్నది అంద‌రికీ ఎరుకే!

బీజేపీకి ప‌టేల్...

వాస్తవానికి గాంధీ కుటుంబాల పాల‌న పుణ్యమాని స‌ర్దార్ వ‌ల్లబాయ్ ప‌టేల్ కు రావాల్సినంత పేరు రాలేదు.ఆయ‌న ఈ దేశ ప్రధానిగా ఉంటే పాల‌న ముఖ‌చిత్రం మ‌రోలా ఉండేద‌న్నది ఓ కాద‌న‌లేని వాస్తవం. ఈ త‌రుణంలోనే బీజేపీకి ప‌టేల్ కావాల్సివ‌చ్చారు. న‌ర్మదా తీరాన ఆయ‌న విగ్రహం ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోశారు.. నిజంగానే నిజంగానే ఇది ప్రేమేనా అంటే ఏం చెబుతాం.. అలానే మ‌హాత్మా గాంధీని కూడా స్వచ్ఛ్ భార‌త్‌కు వాడుకున్నారు. ఔను! గాంధీల పేటెంట్ కాంగ్రెస్‌కు ఉండ‌గా ఈ బీజేపీ ఏంటి అని అనుకోవ‌ద్దు.. మోడీ మ‌న్ కీ బాత్ వినండి మీకంతా ఇట్టే అర్థమైపోతోంది.నిన్నటి వేళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప‌టేల్ విగ్రహం పేరిటో ఎన్టీఆర్ విగ్రహం పేరిటో అంబేద్కర్ విగ్రహం పేరిటో రాజ‌కీయం చేసినా అదంతా నాలుగు ఓట్లు రాల్చుకునేందుకే!

ఇక త‌మిళ‌నాట‌కు వ‌ద్దాం...

అమ్మ జ‌య‌మ్మ మ‌ర‌ణానంత‌రం అనేకానేక ప‌రిణామాల త‌రువాత ఇప్పటికీ ఆమె స్మర‌ణ‌లో నేత‌లంతా త‌రిస్తున్నారు. ఆమె పాల‌నను స్ఫురిం చేలా పాలించేస్తాం అని తెగ భీష‌ణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. వాస్తవానికి అమ్మ పాల‌న స్వర్ణయుగం అని ఎవ‌ర‌న్నారు. ఆమె గారి హ‌యాంలో జ‌రిగిన త‌ప్పిదాలు మ‌రిచి స్మరిస్తారే!! ఆఖ‌రికి ఆమె ఆఖ‌రి గ‌డియ‌ల్లో ఉన్న వీడియోల‌ను సైతం విడుద‌ల చేసి నాలుగు ఓట్లు దండుకున్న నేత‌ల‌కు పాల‌న‌పై నిబ‌ద్ధత ఉంద‌ని ఎలా అనుకోగ‌లం. క‌నుక దిన‌క‌రన్ గ్యాంగ్ కి కానీ ప‌ళ‌ని ప‌న్నీరు ద్వ‌యానికి కానీ ఇంకెవ్వరికీ కానీ సెంటిమెంట్ పూత లేనిదే మాట అంద‌గించ‌దు అని బాగా తెల్సు.. అది త‌మిళనాట మాత్రమే వ‌ర్థిల్లుతుంది అనుకోరాదు మ‌న ఏపీలో కూడా ఇలాంటి రాజ‌కీయ‌మే నెర‌పాల‌ని ల‌క్ష్మీపార్వతి ప్రయ‌త్నించారు. అన్న ఆత్మ శాంతికి తెగ ప్రయ‌త్నించారులేండి.

ఏపీలోనే అంతేగా....

అలానే ఇప్పుడు వైఎస్ ఆశ‌య సాధ‌న అంటూ హ‌డావుడి చేస్తున్న జ‌గ‌న్ అండ్ కో ది కూడా ఇదే తోవ‌! ఎలా నాటి త‌ప్పిదాలు జ‌నం మ‌రిచిపోతారు..?? ఏదో అప్పటి ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మ‌నుషుల‌ను జ‌నం గెలిపించారు స‌రే అదే ప్రాతిప‌దిక‌గా చేసుకుని ఎంత‌కాలం సెంటిమెంట్ రాజ‌కీయాలు నెర‌పుతారు.. ఔనౌను!! వైఎస్ అనే ఈ రెండ‌క్షరాలనూ బ‌తికించాలి.. లేకుంటే క‌ష్టమే.. అలానే వైఎస్‌ని కాంగీయులూ సొంతం చేసుకోవాలి.. కానీ ఆయ‌న హయాంలో జ‌రిగిన అవినీతి బంధుప్రీతి గురించి మాత్రం మాట్లాడ‌రు. అస‌లు స్వర్ణ‌యుగం అంటే ఏంటి?? ఏమో!! వీటికి నాయ‌కుల‌కు తెల్సిన అర్థం మ‌న‌కు తెలియ‌క‌పోవ చ్చు..మ‌నం చూసే కోణంలో కుంభ‌కోణాల వెనుక అంత‌రార్థాలు సూట్ కేస్ రాజ‌కీయాలు అర్థం కాక‌పోవ‌చ్చు.అయిన‌దిపో మ‌న‌మేల చింతించ‌వ‌లె!! ఇవ‌న్నీ ప‌వ‌ర్ పాలిటిక్స్ జ‌నం మోస‌పోవ‌డం జ‌నాన్ని మోస‌గించ‌డం రెండూ వెరీ కామ‌న్‌.. క‌నుక మేల్కొనాల్సింది ప్రజ‌లే!! ఎందుకంటే వారే అంతిమ నిర్ణేత‌లు క‌నుక‌!! ఎప్పుడో ఒక‌ప్పుడు గెలిచే న్యాయం చూసి సిస‌లైన హ‌క్కుల కార్యక‌ర్తలు సంబ‌రాలు చేసుకోవ‌లె..ఇదీ న‌యా భారతం.. ఇదేలా వ‌ర్తమాన చ‌రితం.

Similar News