కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టారు. తల్లి సోనియా నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. నేతలు, కార్యకర్తల హర్షధ్వనాల మధ్య రాహుల్ నెహ్రూ కుటుంబం ఐదో తరం నేతగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ అధ్యక్షుడిగా చేపడుతున్న రాహుల్ కు తన ఆశీస్సులుంటాయన్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీని అందరూ కలిసి ముందుకు నడిపించాలని కోరారు. పార్టీ అధ్యక్షురాలిగా ఇదే తన చివరి ప్రసంగమని సోనియా చెప్పారు. ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. 19 ఏళ్ల క్రితం పార్టీ బాధ్యతలను చేపట్టినప్పుడు నావల్ల అవుతుందా? అని అనిపించిందన్నారు. అయితే అందరి సహకారంతో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తేగలగామన్నారు. రాహుల్ ను అందరూ ఆశీర్వదించి ఆయన నేతృత్వంలో పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలీని కోరారు. ఇందిర, రాజీవ్ గాంధీల బలిదానాలను వృధా కానివ్వద్దన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ సోనియాగాంధీ శక్తమంతమైన నేత అని కొనియాడారు. 19 ఏళ్ల పాటు ఆమె పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించారని, ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక ముఖ్య నిర్ణయాలను తీసుకుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక వాద్రాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు.