ఇదీ నెల్లూరు లొసుగుల నారాయణరెడ్డి స్టోరీ....!

Update: 2018-01-22 14:30 GMT

ఈయన పేరుకే పెద్దమనిషి....కాని వ్యాపారంలో అన్నీ లొసుగులే. అన్నింటా ఆర్థిక అవకతవకలే. రాజకీయ ముసుగులో అడ్డదారిన కోట్లు గడించాలన్న ఈయన ఎట్టకేలకు అరెస్ట్ కావడం సంచలనమయింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న వాకాటి నారాయణరెడ్డి ఆర్థిక సంస్ఘలను మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. అధికార పార్టీలో ఉంటూ బ్యాంకులను మోసం చేయాలన్న ఆలోచన నారాయణరెడ్డి అరెస్ట్ కు దారి తీసింది. దీంతో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదన్న సంకేతాలను పంపినట్లయింది.

ఆస్తులను ఎక్కువగా చూపించి....

వాకాటి నారాయణరెడ్డికి ఉన్న ఆస్తులకంటే ఎక్కువగా చూపి బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. వాకాటి ఆర్థిక సామ్రాజ్యం మామూలుది కాదు. వి.ఎన్.ఆర్ గ్రూపు పేరుతో అనేక భవన నిర్మాణాలు, పవర్ ప్రాజెక్టులు, పరిశోధన పరిశీలన విభాగాలు, వాకాటి ఇన్ ఫ్రా వంటి గ్రూపులను అనేకమైనవి ఈయన సామ్రాజ్యంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక కాంట్రాక్టులు వాకాటికి చెందిన సంస్థలు చేపట్టాయి. రైల్వే, హైవే, పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థలు చేపట్టాయి. అనేక అంతర్జాతీయ సంస్థలతో ఈ గ్రూపుకు ఒప్పందాలు కూడా ఉన్నాయి. అయితే తమ సంస్థలకున్న ఆస్తులను ఎక్కువగా చూపి బ్యాంకుల నుంచి వాకాటి సంస్థలు భారీగా రుణాలను పొందాయి. అయితే ఆర్థిక మాంద్యం దెబ్బకు వాకాటి సామ్రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని.....

ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేదు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి శిష్యరికంతో పాలిటిక్స్ లోకి వచ్చిన వాకాటి తొలుత కాంగ్రెస్, తర్వాత టీడీపీలోకి వచ్చారు. నెల్లూరు సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ గా కూడా పనిచేశారు. రెండు సార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవలే చంద్రబాబు పార్టీ నుంచి వాకాటిని సస్పెండ్ చేశారు. వాకాటి ఐఎఫ్ సి నుంచి దాదాపు 180 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన శామీర్ పేట్ లో ఉండే 12 కోట్ల విలువైన స్థలాన్ని 180 కోట్ల గా చూపించారు. దీంతో వాకాటిపై సీబీఐ కేసు నమోదయింది. ఇటీవలే వాకాటి ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు చేసిన సీబీఐ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో వాకాటి అరెస్ట్ కావడం రాజకీయంగా నెల్లూరు జిల్లాలో సంచలనమయింది.

Similar News