భాగ్యనగర్ కేంద్రంగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పసుపు పార్టీ కేంద్ర కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు అవుతుంది . ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గత చరిత్రకు నిదర్శనంగా మాత్రమే నిలవనుంది. సుమారు మూడున్నర ఎకరాల్లో మూడంతస్థుల సువిశాల భవనాన్ని అత్యాధునిక హంగులతో టిడిపి ప్లాన్ చేసింది. టిడిపి జాతీయ అధ్యక్షుడు ఇక్కడినుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనుండటంతో పసుపుదళం జాతీయ ప్రధాన కార్యాలయం గా ఇదే విరాజిల్లుతుంది.
టిడిపి కార్యాలయం ఎలా ఉండబోతుంది ...?
చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి తరలివచ్చినా ప్రధాన కార్యాలయ ఏర్పాటులో పార్టీ అలసత్వం వహించడంపై ఇటీవల పలుదఫాలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సమీక్షల్లో సీరియస్ అయ్యారు. తొందరగా కార్యాలయ ఏర్పాటు కు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. దాంతో టిడిపి శ్రేణులు పార్టీ కార్యాలయ నిర్మాణానికి నడుం కట్టాయి. టిడిపి జాతీయ ప్రధాన కార్యాలయం మూడంతస్థులుగా నిర్మిస్తారు. మొదటి అంతస్థులో ముఖ్యమంత్రి ఇతర పార్టీ ముఖ్యులు ఉండేలా, 25 పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబంధించిన గదులు ఉంటాయి. రెండో అంతస్థులో మూడు రకాల సమావేశ మందిరాలను నిర్మిస్తారు. ఒకటి చిన్నది మరొకటి మధ్యస్థంగా ఉండేలా , మరొకటి అతిభారీగా ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి సమీక్షలు సమావేశాలనైనా పార్టీ కార్యాలయంలోనే నిర్వహించుకునేలా ప్లాన్ చేశారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోలా కాకుండా 200 కార్లకు పైగా పార్కింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. కార్యాలయం ఆవరణలో మరో 70 కార్లు నిలుపుదల చేసేలా జాగ్రత్త వహిస్తున్నారు.
అమరావతి కేంద్రంగా ఇక అన్ని పార్టీలు ....
ఇప్పటికే వైసిపి తన కార్యాలయం ఏర్పాటు చేసుకోగా, కాంగ్రెస్, వామపక్షాలు ప్రస్తుతం అవి వుండే కార్యాలయాలనే ఏపీ పార్టీ కేంద్ర కార్యాలయాలుగా మార్చుకున్నాయి. ఇక జనసేన సైతం గుంటూరు జిల్లా చినకాకాని లో మూడున్నర ఎకరాల స్థలం మూడేళ్లకు లీజుకు తీసుకుని కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి సిద్ధమైంది. నెలకు లక్షన్నర అద్దెను సైతం స్థలానికి జనసేన చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇలా ప్రధాన పక్షాలన్నీ అమరావతి కేంద్రంగా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి సర్వసన్నద్ధంగా యుద్హానికి సిద్ధం కావడం విశేషం.