ఇతర పార్టీల నేతలనూ చేర్చుకుంటాం... పవన్

Update: 2018-01-22 12:59 GMT

ఈ నెల27 నుంచి అనంతపురంలో కరువు యాత్ర చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయన్నారు. ప్రతి అంశాన్ని తాను రాజకీయ కోణంలో చూడబోనన్నారు. తెలంగాణలో సమస్యలపై కమిటీ అధ్యయనం చేస్తుందని, అధ్యయనం తర్వాత ముఖ్యమంత్రికి సమస్యలపై వివరిస్తానని చెప్పారు. కరీంనగర్ లో మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రేపు, ఎల్లుండి కార్యకర్తలతో సమావేశాలు జరుపుతామన్నారు. జనసేనతో పనిచేయాలనుకున్న వారి సలహాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలపై తెలంగాణలోని కార్యకర్తలందరితో చర్చిస్తామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే తాను యాత్ర చేస్తున్నానడం సరికాదని, తాను కేవలం సమస్యల గురించి మాత్రమే స్పందిస్తానని చెప్పారు. తన ప్రతి అడుగు నిర్మాణాత్మకంగానే ఉంటుందన్నారు. తాను విధ్వంసకర రాజకీయాలు చేయబోనన్నారు. పాతిక సంవత్సరాల ప్రయాణం కోసం పునాదులు వేసిన పార్టీ జనసేన అని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టామన్నారు.

ఈనెల 27 నుంచి అనంతలో కరవు యాత్ర.....

తాను కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాబోనన్నారు. తెలంగాణ సమస్యలపై కూడా స్పందిస్తాననిచెప్పారు. తెలంగాణ ప్రాంతమంటే తనకు అమితమైన ప్రేమ అని పవన్ తెలిపారు. ప్రజలు తీర్పు ఇచ్చిన ప్రభుత్వాన్ని గౌరవించాలని, ప్రభుత్వాలను అస్థిరపర్చే ప్రయత్నాలను చేయబోనన్నారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామని చెప్పారు. తమ పార్టీ కార్యాలయం తెలంగాణలో ఉందన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో సీట్లు, ఓట్లు గురించి తాను ఇప్పుడు ఆలోచించనని చెప్పారు. తాను ఎవరికీ రాజకీయ లబ్ది చేకూర్చబోనన్నారు. ప్రజలకు లబ్ది చేకూర్చాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. తనను ఎవరూ రాజకీయంగా వాడుకోలేరని చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీచేయాలో, ఎంత బలముందో ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుస్తుందన్నారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామన్నారు. అభిమానులు, అభిమానాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేయబోనన్నారు. గొడవ పెట్టుకునే అంశాలపై సున్నితంగా వ్యవహరిస్తానని చెప్పారు. బలమైన నాయకులుండి, పార్టీ మారడానికి ఆమోదయోగ్యమైన కారణాలుంటే ఇతర పార్టీల నేతలనూ జనసేన పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రినికలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంలో తప్పేంటని ప్రశ్నించారు.

Similar News